calender_icon.png 25 October, 2024 | 4:50 AM

డీఏలపై నేడు డిసిషన్

25-10-2024 02:11:44 AM

సాయంత్రంలోగా ప్రకటన

పెండింగ్ బిల్స్ దశలవారీగా ఇస్తాం

  1. ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు
  2. మార్చి 31 వరకు ఏమీ అడగొద్దు!
  3. డిసెంబర్ 9న ఈహెచ్‌ఎస్‌పై ప్రకటన
  4. ఉద్యోగ, టీచర్ల కోసం ౫ వేల ఎకరాలు
  5. సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్‌కమిటీ
  6. దీపావళి తర్వాత శాఖలవారీగా సమావేశాలు
  7. 317పై రిపోర్టును బహిర్గతం చేస్తాం
  8. అన్ని సమస్యలపై క్యాబినెట్ భేటీలో చర్చిస్తాం
  9. ఉద్యోగ, టీచర్ సంఘాలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉద్యోగులు ఆర్థిక పరమైన అంశాల గురించి ప్రభుత్వాన్ని ఏమీ అడగొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థికేతర డిమాండ్లను సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు.

శుక్రవారం సాయంత్రంలోగా పెండింగ్ డీఏలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల జేఏసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు సీఎం దృష్టికి డీఏలు, పెండింగ్ బిల్స్ తదితర సమస్యలను తీసుకెళ్లారు. అనంతరం వారిని ఉద్ధేశించి సీఎం మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, సర్వీస్ రూల్స్ పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.

దీపావళి తర్వాత శాఖలవారీగా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. 317 జీవోపై కమిటీ నివేదికను సైతం బహిర్గతం చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 5 పెండింగ్ డీఏలు ఉండగాచ వీటిలో రెండింటిని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదని ఉద్యోగులతో సీఎం చెప్పారు. రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆర్థిక సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించడం కష్టమేనని తేల్చేశారు.

ఉద్యోగుల ఒక్కో సమస్యను వరుస క్రమంలో పరిష్కరిస్తూ వస్తున్నామని, అన్ని సమస్యల పరిష్కారానికి కొంత సమయమివ్వాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలిమెట్టు అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని జేఏసీ నేతలు చెప్పగా, ఆ విషయం ఆర్థికశాఖ మంత్రిదని, ఆయనతో చర్చించి శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కంటే ఓ గంట ఎక్కవ పనిచేసి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని ఉద్యోగులను కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ఐదువేల ఎకరాల భూమిని అభివృద్ధి చేసి, అందులో మౌలికవసతులు కల్పించి ఆదాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు.

శాఖలవారీగా సమస్యలపై కమిటీ

సర్వీస్ రూల్స్, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, కే కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. దీపావళి తర్వాత విభాగాలవారీగా ఈ కమిటీ అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. త్రిసభ్య కమిటీ ప్రతి రోజు రెండు విభాగాలతో సమావేశమై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని వెల్లడించారు.

317 సమస్యలన్నీ పరిష్కరిస్తాం

౩౧౭ జీవోపై సబ్ కమిటీ సమర్పించిన నివేదికను తాను చదవలేదని ఉద్యోగులతో సీఎం తెలిపారు. నివేదిక ప్రతులను ప్రతి సంఘానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. అందులో తెలియజేసిన పరిష్కారాల ప్రకా రం ప్రతిదీ వెంటనే అమలు జరుగుతుందని హామీ ఇచ్చారు. మిగతా వాటిపై సంఘాలు ఇచ్చే సూచనల ప్రకారం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని సానుకూల పరిష్కారం చూపిస్తుందని తెలిపారు.

ఉద్యోగ సంఘాల న్నీ బలపడాలని కోరారు. సంఘం నాయకులను జైళ్లలో పెట్టే సంస్కృతి తమది కాదని, అందరం సమానమని అన్నారు. సీపీఎస్‌పై నిర్ణయం తీసుకుంటాం సీపీఎస్ రద్దు అంశా న్ని సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. కేజీబీవీ, ఎస్‌ఎ స్‌ఏ ఉద్యోగులకు ఎంటీఎం అమలు చేయడంపై సానుకుల నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.

అన్ని రకాల గురుకులాలను ఒకే డైరెక్టరేట్ పరిధిలోనికి తీసుకురావాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించిన ట్లు టీచర్లు తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 317 జీవోను అమలు చేయ టం.. మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 హెడ్ ద్వారా వేతనాలు ఇవ్వడంపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ప్రభుత్వంపై నమ్మకముంది: జేఏసీ నేతలు

ప్రభుత్వంపై తమకు విశ్వాసం ఉందని జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఒకటిరెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణను వాయిదా వేస్తున్నట్లు ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు.

డిసెంబర్ 9న ఈహెచ్‌ఎస్‌పై ప్రకటన

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ నగదు రహిత స్కీం అంశాన్ని సీఎం దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు. దీంతో సీఎం డిసెంబర్ 9న సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్స్‌ను దశలవారీగా విడుదల చేస్తామని తెలిపారు. అప్‌గ్రెడేషన్ కాకుండా మిగిలిన లెఫ్ట్‌ఓవర్ భాషా పండితులు, పీఈ టీలను అప్‌గ్రెడేషన్ చేయడంపై సానుకూలంగా స్పందించారు.

పదివేల పీఎస్ హెచ్ పోస్టుల మంజూరుకు తక్షణం నివేదిక రూపొందించి పదోన్నతులు పూర్తి చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, శ్రీపాల్‌రెడ్డి, చావ రవి, పీ మధు సూద న్ రెడ్డి ముజీబ్ హుస్సేన్, పర్వత సత్యనారాయణ, జీ సదానందంగౌడ్, కట కం రమేష్, వీ రవీందర్‌రెడ్డి, కృష్ణుడు దామోదర్‌రెడ్డి, అంజిరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.