- అడవిబిడ్డల అభివృద్ధికి అటవీశాఖ సహకరించాలి
- పెసాచట్టంపై జాతీయ సదస్సులో మంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రామసభలకు సంపూర్ణ అధికారాలు ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల కనీస అవసరాలకు ఆటంకాలు కలిగించకుండా అటవీ, పర్యావరణ శాఖను సమన్వయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలోని డా.బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ చట్టాన్ని వర్తింపజేసే పెసా చట్టంపై జరిగిన జాతీయ సదస్సుకు మంత్రి సీతక్క హాజరయ్యారు.
కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బఘేల్‌తో కలిసి సదస్సును ప్రారంభించారు. అనంతరం పెసాచట్టం అమల్లో ఎదురవుతున్న సమస్యలపై మంత్రి సీతక్క మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పెసా చట్టం అమలుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిబంధనలు ఆటంకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం ములుగులో పాఠశాల భవనానికి అనుమతి లేకపోవడంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతిలివ్వని కారణంగా ఆదివాసీ గూడాలు నేటికీ కరెంట్ వెలుగులకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నికలు జరగలేదన్న కారణంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిలిపేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బఘేల్‌ను మంత్రి సీతక్క కోరారు. గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల కాకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ విమర్శలు అర్ధరహితం
అమృత్ పథకం విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని మంత్రి సీతక్క కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని, బీఆర్‌ఎస్ ఎందుకు తొందరపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బంధువు అయినందునే సృజన్‌రెడ్డికి అమృత్ టెండర్లు దక్కాయన్న విమర్శలు సరికావన్నారు.