24-03-2025 11:55:32 PM
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి 4 వారాల గడువు..
తదుపరి విచారణ ఏప్రిల్ 21కి వాయిదా..
న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పౌరసత్వం గురించి ఏదో ఒకటి తేల్చాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ ఆంశంపై నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని సూచిస్తూ ఈ కేసును ఏప్రిల్ 21కు వాయిదా వేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో చాలా రోజుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బ్రిటన్ పౌరుడని ఆరోపిస్తూ.. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారించిన లక్నో బెంచ్ కేంద్రానికి 4 వారాల గడువునిస్తూ తీర్పు వెలువరించింది. బ్రిటన్‌లో ఉన్న ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్‌లో తాను బ్రిటీష్ పౌరుడినని రాహుల్ గాంధీ పేర్కొన్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపైనే కొద్ది రోజులుగా కేసు నడుస్తోంది.