28-03-2025 12:00:00 AM
నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి) : ప్రేమ,పెళ్లి పేరుతో దళిత యువతిని మోసగించిన కేసులో నల్లగొండ జిల్లా స్పెషల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 27 ఏండ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ గురువారం న్యాయమూర్తి రోజా రమణి తీర్పు నిచ్చారు. నల్లగొండ జిల్లా కనగల్లు మండలం పర్వతగిరికి చెందిన నల్లబోతు జగన్, గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దళిత యువతిని ప్రేమించానని నమ్మించాడు.
పెండ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. తరువాత మొఖం చాటేయడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించారు. విచారణలో కేసు వాదోపవాదాలు విని, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి యువకుడిని దోషిగా తేల్చారు.
యువతిపై అత్యాచారం చేసినందుకు పదేళ్ల జైలు, రూ.1000 జరిమానా, దళిత యువతిని మోసగించినందుకు మరో పదేళ్ల జైలు శిక్ష, రూ 1000 జరిమానా, పెళ్లి చేసుకుంటానని మోసగించినందుకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పునిచ్చారు.