- రైతన్న ఎంతో.. నేతన్నా అంతే
- గతంలో ఆర్భాటాలే తప్ప ఆదుకోలేదు
- నేతన్నల ఉపాధి కోసమే బతుకమ్మ చీరల కొనసాగింపు
- స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న 63 లక్షల మంది మహిళలకు ఏడాదికి ఒక్కొక్కరికి రెండేసి చేనేత చీరలు
- నా గెలుపులో నేతన్నలది కీలక పాత్ర
- ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
- ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చేనేత రంగానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందని.. తమకు రైతన్న ఎంతో నేతన్న కూడా అంతేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలిచినట్టే చేనేత కార్మికులకు కూడా అండగా నిలిచి ఆదుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పా టుచేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్ల్యూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నాంపల్లిలోని లలితకళాతోరణం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐఐహెచ్‌టీని వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లా డుతూ... ఒకే వేదికగా భారీ సంఖ్యలో నేతన్నలందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐఐహెచ్‌టీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడే హైదరాబాద్ నగరం తమ వద్ద ఉందని, తెలంగాణకు తప్పకుండా ఐఐహెచ్‌టీ మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై వారు కూడా సానుకూలంగా స్పందించి.. రాజకీయాలకు అతీతంగా వెంటనే మంజూరు చేశారని పేర్కొన్నారు.
రుణాలు రూ.30 కోట్లే అయితే మాఫీ చేస్తా..
చేనేత సంఘాలకు సంబంధించిన ఎన్నికలను తాను కూడా సమర్థిస్తున్నానని, సంఘాలకు ఎన్నికలు నిర్వహించినప్పుడే చేనేత వర్గం నుంచి కూడా రాజకీయ ప్రాతినిధ్యం లభించేందుకు అవకాశం ఉంటుం దన్నారు. చేనేత సంఘాల ఎన్నికలపై సమీక్షించి వెంటనే కార్యాచరణ, ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులను వేదిక నుంచే ఆదేశించారు. చేనేత కార్మికుల రుణాలు కేవలం రూ.30 కోట్లే ఉన్నది నిజమైతే ఒక్క కలం పోటుతో రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కులవృత్తులను, చేతివృత్తులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది స్కిల్స్ వర్సిటీలో ఐఐహెచ్‌టీ
ఐఐహెచ్‌టీ ద్వారా చేనేత వర్గానికి ఎంతో మంచి జరుగుతుందని.. మంచి పని ఈ ఏడాదే మొదలు కావాలనే ఉద్దేశంతో తాత్కాలికంగా తెలుగు విశ్వవిద్యాలయంలో ఐఐహెచ్‌టీ నిర్వాహణను ప్రారంభిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ యువతలో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా ఫోర్త్‌సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మన నేతన్నల ప్లిలలు కూడా స్కిల్స్ వర్సిటీలో చదువుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే వచ్చే ఏడాది వరకు ఐఐహెచ్‌టీ భవనాన్ని స్కిల్స్ వర్సిటీలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని నేతన్నలు రెక్కాడితేగానీ డొక్కాడని స్థితిలో ఉన్నారని, అందుకే ఐఐహెచ్‌టీలో చదివే వారి పిల్లలకు 2500 స్టుఫైండ్ సదుపాయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. థ్రిఫ్ట్ ఫండ్ రూ.290 కోట్ల చెక్కును అందించడం ద్వారా మీ సంతోషంలో పాలుపంచుకునే అవకాశం లభించిందన్నారు.
ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. ఆయనను శాశ్వతంగా గుర్తు చేసుకుంటూ.. ఆయన గౌరవం పెంచే విధం గా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందు లో భాగంగానే ప్రస్తుతం ప్రారంభిస్తున్న ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల, అధికారులను ఆదేశించారు. తక్షణమే దీనికి సంబంధించిన జీవో విడుదల చేయాలని సూచించారు.
నేతలన్నతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది: మంత్రి తుమ్మల
నేతన్నలు కోరుకున్న ప్రభుత్వం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది. నేతన్నల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. తాత్కాలికంగా, శాశ్వతంగా వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. శైలజా రామయ్యర్‌కు శాఖ బాధ్యతలు అప్పజెప్పడంతో సగం కష్టం తీరింది. నేతన్న కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. తెలంగాణ నేతన్నలకు తిరుగు లేకుండా చేయాలనే ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా చర్యలు తీసుకుని సఫలీకృతం చేస్తాం. నేతన్నలు అడిగినవన్నీ ఇవ్వాలని, వారికి సంబంధించిన ఏ ఫైల్ కూడా నా దగ్గర పెండింగ్‌లో ఉండొద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. చిన్న వయసులోనే సీఎం అయినప్పటికీ అన్ని వర్గాలకూ న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
నేతన్నలు అడగకపోయినా అవస రాలు తెలుసుకుని చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఐఐహెచ్ టీలో శిక్షణ పొందే ఐదుగురు విద్యార్థులకు 2,500 స్టుపెండ్ చెక్కులను వారికి అందజేశారు. దీంతోపాటు అభయ హస్తం లోగోను ఆవిష్కరించారు. ఈ వేదికగా టెస్కో ఉద్యోగ బృందం ఒక రోజు వేతనం రూ.4,31,965 లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళమిచ్చారు. దానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందించారు.
హాండ్ల్యూమ్, టెక్స్‌టైల్ శాఖ నుంచి కూడా రూ.50 లక్షల విరాళాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కు ను శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సీఎం రేవంత్‌రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, చేనేత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గత పాలకులది హంగులు, ఆర్భాటాలే..
నేతన్నల విషయంలో గత ప్రభుత్వం హంగులు, ఆర్భాటాలు చేసిందే తప్ప.. ఏ రోజు వారిని ఆదుకోవాలనే ఆలోచనే వారి లేదని మండిపడ్డారు. సినీ తళుకుబెలుకులు ప్రదర్శించారు.. కానీ చేనేతల పరిస్థితి మాత్రం మారలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పథకం ద్వారా అందించాల్సిన చీరలను కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ నేతన్నలతో కాకుండా బయట నుంచి దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. దీనితోడు బతుకమ్మ చీరల బకాయిలను కూడా నేతన్నలకు అందించకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే బకాయిలను విడుదలచేసి నేతన్నలను ఆదుకున్నామని వెల్లడించారు.
బతుకమ్మ చీరల పథకం ఆగిపోతే.. దాని ద్వారా నేతన్నలు ఉపాధి పొందే అవకాశం కూడా పోతుందని ఉద్దేశంతో పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కానీ గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు.. వాటి తయారీకి తగిన పెట్టుబడి పెట్టలేదని చెప్పారు. బతుకమ్మ చీరల బకాయిలను కూడా చెల్లించకుండా గత ప్రభుత్వం నేతన్నలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. చేనేతల కళ్లలో ఆనందం చూసేందుకు రూ.290 కోట్ల బకాయిలను విడుదల చేసినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న 63 లక్షల మంది మహిళలకు ఏడాదికి ఒక్కొక్కరికి రెండేసి చేనేత చీరలను పంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తద్వారా ప్రతియేటా 1.30 కోట్ల చీరలను పంచనున్నట్టు తెలిపారు.
నా గెలుపులో నేతన్నలది కీలక పాత్ర
కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గీ ప్రాంతంలో వేలాది మంది నేతన్నలున్నారని.. తన గెలుపులో నేతన్నలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఏ ప్రాంతపు నేతన్న అయినా వారు మన నేతన్నలే అని, వారందరూ కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులేనని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా కార్యాలయ ఏర్పాటుకు స్థలం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీనే త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్‌కు, ఆయన పార్టీకి నిలువ నీడనిచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీనే అని తెలిపారు.
అంతా ఎలక్షన్.. సెలక్షన్.. కలెక్షన్..
ఉద్యమ నాయకులు, ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే వారు రాజీనామా చేయడం తప్ప చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో ఎలక్షన్... సెలక్షన్... కలెక్షన్... మాత్రమే వారికి తెలుసు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో గుర్తించిండ్రు. ఉద్యమానికి ముందు రబ్బర్ చెప్పులు కూడా లేనోళ్లకు ఇప్పుడు పేపర్లు, టీవీలు, బంగ్లాలు, కార్లు, ఆస్తులు ఎలా వచ్చినయి. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీకి ఏమీ రానిది.. వారికెలా వచ్చాయి. కొండా లక్ష్మణ్ బాపూజీతో వారి పోలికేంటి? రాష్ట్రం కోసం ఆయన చేసింది నిజమైన త్యాగం. ఉద్యమ కారులమని చెప్పుకొనే వారికి త్యాగమనే పదమే సూట్ అవ్వదు.
-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి