calender_icon.png 28 October, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పు సోపాలు

30-08-2024 01:35:43 AM

కేంద్రంపైనే అంతా భారం

  1. కార్పొరేషన్ల ద్వారా భారీ మొత్తంలో అప్పులు తీసుకున్న బీఆర్‌ఎస్ సర్కారు
  2. వడ్డీల భారంతో అవస్థలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం  
  3. ఓపెన్ మార్కెట్‌లో 7.6% మిత్తీలతో రుణాలు 

గత ప్రభుత్వం 10.49 శాతానికి తెచ్చిన వైనం

95% గ్యారెంటీలు ఆ ఐదు కార్పొరేషన్లవే

రీషెడ్యూల్ చేయాలంటూ కేంద్రానికి 

కాంగ్రెస్ సర్కారు వేడుకోలు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో సతమతమవుతున్నది. గత సర్కారు చేసిన రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు విశ్వప్రయత్నాలను చేస్తోంది. గత పదేళ్లలో సర్కారు ప్రభుత్వ గ్యారెంటీలను చూపి.. 45 కార్పొరేషన్ల ద్వారా రూ.3,81,501 కోట్ల రుణాలను తీసుకుంది. ఈ గ్యారెంటీల వాటాలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్, తెలంగాణ జలవనరుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మంట్ కార్పొరేషన్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా 95 శాతం గ్యారెంటీలతో గత ప్రభుత్వం అప్పులు తెచ్చింది.

ప్రభుత్వ గ్యారెంటీల్లో ఈ ఐదు కార్పొరేషన్లదే 95 శాతం వాటా అని గణాంకాలు చెబుతున్నాయి. ఆ కార్పొరేషన్ల రుణాలకు సర్కారు నెలనెలా రూ. కోట్లలో వడ్డీలు చెల్లిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు అప్పులు మొత్తం తీర్చిలేని పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు కనీసం వడ్డీల భారాన్ని అయినా తగ్గించుకోవాలని చూస్తోంది. అందుకే అనాలోచితంగా గత ప్రభుత్వం తీసుకున్న అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. దీని కోసం గత రెండు నెలల్లో రెండు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.

ఏడాదికి రూ.32,939కోట్లను వడ్డీల చెల్లింపు

ఓపెన్ మార్కెట్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు 7.63శాతం వడ్డీకి రుణాలను ఇస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం గరిష్టంగా 10.49 శాతానికి కూడా అప్పులు తెచ్చింది. దీని వల్ల వడ్డీ భారం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం ప్రభుత్వం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.32,939 కోట్లను వడ్డీల రూపంలో చెల్లించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థ చేసుకోవచ్చు. 2014 ఆర్థిక సంవత్సరంలో  రూ.6,954 కోట్ల వడ్డీల వార్షిక చెల్లింపులు ఉండగా.. కరోనా తర్వాత ప్రతి ఏడాది 22 శాతం పెరుగుతూ వచ్చినట్లు ప్రభుత్వం తన శ్వేతపత్రంలో పేర్కొంది.

గత ప్రభుత్వం విచ్చలవిడిగా తెచ్చిన అప్పులను రీషెడ్యూల్ చేయడం వల్ల తమపై భారం తగ్గుతుందని ఇటీవల నిర్మలా సీతారామన్‌ను కలిసిన సమయంలో డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రుణాల రీ షెడ్యూల్ కోసం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై పలుసార్లు ప్రధాని మోదీ కూడా కలిసి విన్నవించారు. కానీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఫలితంగా ప్రభుత్వం వడ్డీల భారాన్ని మోయాల్సి వస్తోంది.

రీ షెడ్యూల్ చేయడం వల్ల ఏమవుతుంది?

రాష్ట్రానికి చెందిన అప్పులను రీ షెడ్యూల్ చేయడం వల్ల రుణాలన్నీ ఒకే సంస్థ పరిధిలోకి రావడం, లేదా.. అప్పులు చెల్లించే వ్యవధిని ఎక్కువ సంవత్సరాలు పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా ప్రతి ఏడాది.. వడ్డీలతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా భారీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  రుణాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వడ్డీ భారీగా తగ్గుతుంది. బహిరంగ మార్కెట్‌లో వడ్డీరేటు 7.63శాతం ఉంది. తెలంగాణ సర్కారు మొత్తం 45 కార్పొరేషన్ల ద్వారా అప్పులను తీసుకున్నది.

వాటిలో ఐదు కార్పొరేషన్ల లోన్లను 7.63 శాతం వడ్డీ ప్రకారం రీషెడ్యూల్ చేయడం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.2,873.12 కోట్లు అదా అయ్యే అవకాశం ఉంది. మిగతా 40 రుణాలను రీషెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. ఇంకా భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఒక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కోసం ప్రభుత్వం దాదాపు ఏడాదికి దాదాపు రూ.7,227 కోట్ల వడ్డీని చెల్లిస్తోంది. అప్పును రీషెడ్యూల్ చేయడం వల్లే దాదాపు రూ.5,691 కోట్లకు వడ్డీ తగ్గుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అప్పులు చెల్లించే కాల వ్యవధిని పెంచుకుంటే.. ఈ వడ్డీ రూ.3 వేల కోట్లకు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదని అధికారులు అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం వడ్డీల భారం దాదాపు సగం తగ్గుతుందనే అభిప్రాయంలో సర్కారు ఉన్నట్లు సమాచారం.

దాదాపు 95 శాతం గ్యారంటీలతో ప్రభుత్వం అప్పులు తెచ్చిన కార్పొరేషన్లు ఇవే.. (కోట్లలో..)

కార్పొరేషన్ 1-12-2023 నాటికి చెల్లిస్తున్న మొత్తం రీషెడ్యూల్ చేస్తే ఉన్న అప్పు 

చెల్లిస్తున్న  వడ్డీ వడ్డీ శాతం 7.63 ప్రకారం ఎంత తగ్గుతుంది? 

కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు 74590 9.69% 7,227 1,535.78

కార్పొరేషన్ లిమిటెడ్

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ 20,200 9.48% 1,914.96 373.7

సప్లయ్ కార్పొరేషన్

తెలంగాణ జలవనరుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 14,060 10.49% 1,474.894 402.11

డెవలప్‌మంట్ కార్పొరేషన్

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 6,470 8.98% 581.00 493.66

తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ 

కార్పొరేషన్ 2,951 9.93% 293.034 67.87