- బాధితులకు కాంగ్రెస్ తరఫున 100 ఇండ్లు
- ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ వెల్లడి
తిరువనంతపురం, ఆగస్టు 2: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కి చేరింది. సహాయక చర్యలు శుక్రవారం కూడా కొనసాగాయి. మట్టి, రాళ్లకింద సమాధి అయినవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం భారీ యంత్రాల సాయంతో వెదుకుతున్నాయి. ఈ విపత్తులో సర్వస్వం కోల్పోయిన నిలువ నీడలేకుండా పోయిన బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకొంటున్నాయి. సహాయ క్యాంపుల్లో ఉన్న బాధితులకు నిత్యావసరాలు, ఆహారం సరఫరా చేస్తున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వంద ఇండ్లు కట్టిస్తాం: రాహుల్‌గాంధీ
వయనాడ్ దుర్ఘటనలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున వంద ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో రాహుల్‌గాంధీ శుక్రవారం రెండోరోజు కూడా పర్యటించారు. మెప్పాడిలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండ్లు కోల్పోయిన బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున 100 ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.