calender_icon.png 12 October, 2024 | 1:59 PM

హైదరాబాదీ అగ్నివీర్ల దుర్మరణం

12-10-2024 01:06:59 AM

  1. నాసిక్‌లో శిక్షణలో పేలిన మందుగుండు
  2. విశ్వరాజ్‌సింగ్, సైఫత్ షిత్‌కు తీవ్ర గాయాలు
  3. చికిత్స పొందుతూ మృతి
  4. దుర్ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన సైన్యం

నాసిక్, అక్టోబర్ 11: శిక్షణలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అగ్నివీర్లు దుర్మరణంపాలయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న డియోలాలీ ఆర్టిలరీ స్కూల్‌లో అగ్నివీర్లకు శిక్షణ ఇస్తుండగా శుక్రవారం ఈ దుర్ఘటన జరిగిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ అంశంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించింది. మృతులను శివ్వరాజ్‌సింగ్ (20), సైఫత్ షిత్ (21)గా గుర్తించారు. హవల్దార్ అజిత్‌కుమార్ ఫిర్యాదు మేరకు డియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.

ఆర్టిలరీ విభాగంలో రోజువారీ శిక్షణలో భాగంగా క్యానన్‌లోకి బాంబ్ షెల్‌ను లోడ్ చేస్తుండగా అది పేలిపోయిందని సైన్యం తెలిపింది. తీవ్రంగా గాయపడిన ఈ ఇద్దరు అగ్నివీర్లను మిలిటరీ దవాఖానకు తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయిందని, తీవ్ర గాయాలతో వారు మరణించినట్లు తెలిపింది. 

రాజస్థాన్‌లోనూ ప్రమాదం

అగ్నివీర్ల శిక్షణలో ఈ నెల 4వ తేదీన రాజస్థాన్‌లోనూ ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకొన్నది. గోల్‌పురా సైనిక క్యాంపులో మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా ఒక బాంబు పేలి సౌరభ్ పాల్ (24) అనే అగ్నివీర్ మరణించాడు.