calender_icon.png 14 October, 2024 | 5:59 AM

జీఎన్ సాయిబాబా మృతి

14-10-2024 03:13:07 AM

  1. కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్
  2. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి 
  3. ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రికి ఆయన కళ్లు దానం 
  4. నేడు గాంధీ దవాఖానకు పార్థివ దేహం అప్పగింత 
  5. ప్రజల సందర్శనార్ధం నేడు మౌలాలీలోని ఇంటికి 
  6. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు
  7. 2014లో సాయిబాబా అరెస్టు.. పదేండ్లపాటు జైలు జీవితం
  8. ఇటీవల నిర్ధోషిగా విడుదల

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (57) కన్నుమూశారు. ౨౦ రోజులుగా అనారోగ్యంతో నిజాం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన.. శని వారం రాత్రి 8.45లకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

ముందుగానే నిర్ణయించినట్లు ఆయన కండ్ల ను హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి దవాఖానకు అప్పగించారు. సాయిబాబా పార్థివదేహాన్ని కూడా సోమవారం గాంధీ దవాఖానకు అప్పగించనున్నారు. అంతకుముందు నిమ్స్ నుంచి భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్ధం మౌలాలీలోని ఆయన ఇంట్లో ఉంచుతారు. మధ్యా హ్నం 2 గంటల తర్వాత గాంధీ దవాఖానకు తరలిస్తామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

పిత్తాశయం సమస్యలతో ఆయన 20 రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 5 రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. అనంతరం ఇన్‌ఫెక్షన్‌తో పాటు తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరంలోని చాలా అవయవాలు పనిచేయటం మానేయటంతో ఆయ న మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

పదేండ్లపాటు జైల్లో నరకం

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు 90 శా తం శారీరక వైకల్యం ఉన్నది. దీంతో ఆయన జీవితాంతం వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

సాయిబాబాతోపాటు మహేష్ తి ర్కీ, పాండు నరోటే, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీలను మహారాష్ట్ర పోలీసులు 2014లో అదుపులోకి తీసుకొన్నారు. 2016 వరకు అండర్ ట్రయిల్ ఖైదీగా సాయిబాబా జైలులో ఉన్నారు. దేశద్రోహం వంటి కఠినమైన చట్టాల కింద అభియోగా లు మోపటంతో ఆయనకు బెయిల్ రాలేదు.

దీంతో జైల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. కేసు విచారణ అనంతరం ఉపా చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో 2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు నాగపూర్ జైలులో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీ ఆయనను సస్పెండ్ చేసింది.

కోర్డు శిక్ష వేయటంతో ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిం చింది. 2020లో ఆగస్టు 2న సాయిబాబా తల్లి సూర్యావతి మరణించగా ఆమె భౌతికకాయాన్ని చూసేందుకు కూడా న్యాయ స్థానం సాయిబాబాకు అనుమతివ్వలేదు. సాయిబాబాతోపాటు మిగతా దోషులంతా ట్రయల్‌కోర్టు తీర్పును సవాల్ చేయటంతో బాంబే హైకోర్టు వారంతా నిర్దోషులని 2022 అక్టోబర్ 14 తీర్పు ఇచ్చింది.

ఆ వెంట నే మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో మరుసటి రోజే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వటంతో సాయిబాబా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 2024 మార్చి 5న బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ ఈ ఆరుగురిపై మోపిన కేసులను కొట్టివేసింది.

ఈ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం లో అప్పీల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ప్రాఫెసర్ సాయిబాబాతోపాటు ఆరుగురినీ విడుదల చేయడం సరైం దేనని తేల్చిచెప్పింది. దీంతో నాగపూర్ జైల్లోని అండాసెల్‌లో 8 ఏళ్లకుపైగా కఠిన జైలు జీవితం గడిపిన సాయిబాబా విడుదలయ్యారు.

నెల రోజుల క్రితం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన జైల్లో తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు కదా.. ఆరోగ్య రీత్యా బెయిల్ అడుగుదామని సన్నిహితులు, కుటుంబసభ్యులు సూచించినా తాను ప్రజాహక్కుల కోసం నిలబడ్డ వ్యక్తినని, అంగవైకల్యాన్ని అడ్డుపెట్టుకోనని అన్నట్టు గుర్తుచేశారు. 

నేడు గాంధీకి మృతదేహం  

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కోరిక మేరకు ఆయన కళ్లను కుటుంబ సభ్యులు ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రికి అప్పగించారు. శనివారం రాత్రి మరణించిన అనంతరం ఎల్‌వీ ప్రసాద్ వైద్యులు నిమ్స్‌కు వచ్చి కళ్ల ను భద్రపరిచారు. నేడు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అందజేయనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల మధ్య సాయిబాబా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు నిమ్స్ వైద్యులు అప్పగిస్తారు.

అక్కడ నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లి కొద్ది సేపు ఉంచుతారు. ఆ తర్వాత మౌలాలిలోని జవహర్‌నగర్‌లో ఉన్న సాయిబాబా సోదరుడు డాక్టర్ రాందే వ్ నివాసానికి తరలిస్తారు. ఇక్కడ మధ్యా హ్నం 2 గంటలవరకు ప్రజల సందర్శనార్థం ఉంచి, ఆ తర్వాత ర్యాలీగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అప్పగించనున్నారు. 

పౌర హక్కులకోసం తుదకంటా పోరాటం 

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని జల్లుపల్లి నడిపూడి గ్రామానికి చెందిన గోగరకొండ నాగ సాయిబాబా 1967లో జన్మించారు. ఐదేళ్ల వయసులో కండరాల క్షీణత రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయా యి. అమలాపురం సెయింట్ జాన్ స్కూల్లో  పాఠశాల విద్యను పూర్తి చేశా రు. శ్రీకోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో డిగ్రీ చదివి ఆంధ్ర యూని వర్శిటీలో ర్యాంకర్‌గా నిలిచారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంఏ (ఇంగ్లిష్) చదివారు. ఢిల్లీ యూనివర్శిటీలో చేరిన సాయిబాబా ఇండియ న్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్ అండ్ నేషన్ మేకింగ్ అనే అంశంపై థీసిస్ సమర్పిం చి 2013లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్శిటీ అనుబంధ రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా చేరారు.

సాయిబాబా గ్రామానికే చెందిన సహాధ్యాయిని వసం త కుమారితో వివాహం అనంతరం ఢిల్లీకి మకాం మార్చారు. అమలాపురం లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వామపక్ష రాజకీయాలకు ఆకర్షితులైన సాయి బాబా ఆల్ ఇండియా రెసిస్టెన్స్ ఫోరమ్ లో చేరారు. ఆ సంస్థ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదివేటప్పుడు మండ ల్ కమిషన్‌కు అనుకూలంగా జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1993లో హైదరాబాద్‌లో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 35 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. జైళ్లలో కుల వివక్షపై పోరాటం చేశారు.

జైళ్లలో ఏ కులానికి చెందిన ఖైదీలతో జైలు అధికారులు ఎలాంటి పను లు చేయిస్తున్నారో ఎత్తి చూపారు. జీఎన్ సాయిబాబా వసంతకుమారి దంపతుల కుమార్తె మంజీర ప్రస్తుతం ముంబైలో ఇంగ్లిష్ ప్రాఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

సాయిబాబా మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర హక్కుల సంఘాల నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. 

అసమానతలపై పోరాడిన మానవతావాది: మంత్రి సీతక్క

సమాజంలోని అసమానతలను రూపుమా పేందుకు జీవితాంతం పోరాడిన మానవతావా ది ప్రొ.సాయిబాబా అని మంత్రి  సీతక్క అన్నారు. ఆయన మృతిపట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగా సానుభూతిని,  సంతాపాన్ని తెలిపారు. సాయిబాబా ప్రజల పక్షపాతి, పౌరహక్కుల ఉద్యమకారుడు అని కొనియాడారు. జైలు జీవితాన్ని అనుభవించినా చివరి వరకు నిబద్ధతతో ప్రజల కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఆయన పంథాతో అందరూ ఏకీభవించకపోయినా ఆయన సిద్ధాంత పటిమ, చిత్తశుద్ధితో అందరికీ ఆయనంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. 

ఉద్యమాలకు తీరనిలోటు: తమ్మినేని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి 

ప్రొఫెసర్.సాయిబాబా మృతి ఉద్యమా లకు తీరనిలోటు అని సీపీఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సానుభూతిని తెలియజేశారు. 90శాతం అంగవైకల్యం ఉన్న సాయిబాబాపై  టెర్రరిస్టు నెపంతో 2014 నుంచి ఉపాచట్టాన్ని ప్రయోగించి దీర్ఘకాలం జైలులో నిర్భందించిందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోడారని అన్నారు. 

దోపిడీ రహిత సమసమాజ స్వాప్నికుడు: చంద్రన్న సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ 

దోపిడీ రహిత సమసమాజ స్వాప్నికుడు, ప్రపంచం గర్వించదగ్గ మేధావి ప్రొఫెసర్ సాయిబాబా అని సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చం ద్రన్న పేర్కొన్నారు. ఆదివాసులపై రాజ్యం చేస్తున్న దమనకాండను ప్రశ్నించిన గొంతుక అని, నమ్మిన ఆశయం, సిద్ధాంతం కోసం పనిచేసిన మడమ తిప్పని యోధుడు అని కొనియాడారు. ఆయన కుటుంబానికి తమ పార్టీ కేంద్ర కమిటీ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పీడితుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి: పౌర హక్కుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి నారాయణరావు

పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ప్రొ. సాయి బాబా అని పౌరహక్కుల సంఘం తెలం గాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు అన్నారు. అక్రమ కేసులతో దశా బ్ధకాలం పాటు నిర్భందించినా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం  పోరాడిన ధీరోదాత్తుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబా నికి  పౌరహక్కుల సంఘం  ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తోందన్నారు. 

అన్యాయాన్ని ఖండించాలి: ప్రొఫెసర్ హరగోపాల్

ప్రొఫెసర్ సాయిబాబాకు జరిగిన అన్యా యాన్ని ఖండించాలని, భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా సమాజం చైతన్యంతో స్పందించాలని నిర్భంద వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, కో కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచం దర్ అన్నారు. మానవహక్కుల కార్యకర్త, కవి, రచయిత, విద్యావేత్తగా పేరుపొందిన ఆయన రాజ్యం కక్షపూరిత చర్యల కు బలైపోయాడన్నారు. 1990 నుంచి  అనేక ఉద్య మాలకు నాయకత్వం వహించారన్నారు. ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.