calender_icon.png 24 October, 2024 | 7:54 PM

గల్ఫ్ బాటలో మృత్యువు వేట!

05-08-2024 01:09:23 AM

నెలరోజుల్లో ఎడారి దేశంలో ఇద్దరు జిల్లావాసుల మృతి

ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఎన్నారై పాలసీ 

ఆ తర్వాత అటక పైకి గల్ఫ్ సంక్షేమం 

ప్రవాసంలో మృతిచెందిన వారి కుటుంబాలు రోడ్డుపాలు

ఎన్నారై పాలసీ ప్రవేశపెట్టాలని గల్ఫ్ బాధితుల విజ్ఞప్తి

ఎం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): బతుకు దెరువు కోసం గల్ఫ్ బాట పడుతున్నవారు అపసోపాలు పడుతున్నారు. లక్ష లు అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో చేసిన అప్పులను తీర్చలేక అక్కడ బతకలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

దేశంకాని దేశంలో వారు ఆత్మహత్యలకు పాల్పడుతుం టే ఇక్కడ వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజెపల్లి వాసి గుగులోత్ నరేశ్ (30) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా దుబాయ్‌కి వలస వెళ్లాడు. అక్కడ వేతనాలు ఇవ్వ కపోవడంతో అప్పులు తీర్చే మార్గంలేక మనస్థాపానికి గురై పనిచేసే చోట ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  

వెళ్లిన మూడు రోజులకే..

తాను కష్టపడ్డ కుటుంబం సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో గల్ఫ్ వెళ్లిన ఓ యువకుడిని మూ డ్రోజులకే మృత్యువు కబలించింది. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆర్గోండకు చెందిన కొర్పోల్ శ్యామయ్య (38) గత నెల 5న సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన అనంతరం పరిస్థితులు బాగా లేకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వెళ్లిన రెండు రోజులకే ఆసుపత్రిలో చేర్పించారు.

మరుసటి రోజు ఆరోగ్యం క్షిణించి మృతిచెందాడు. సౌదీలో ఉన్న గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యుడైన మహమ్మద్ ఫరూక్.. శ్యామయ్య మృతదేహాన్ని ఇంటికి పంపించేందుకు బాధ్యతలు తీసుకున్నారు. శ్యామయ్య వెళ్లిన కంపెనీ, ఇండియన్ ఎంబీసీతో మాట్లాడి మృతదేహాన్ని ఆదివారం ఇంటికి పంపించారు.

ఎన్నారై డిపార్ట్‌మెంట్ అధికారి చిట్టిబాబు సహకారంతో మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇంటి వరకు ఉచిత అంబులెన్స్‌లో తరలించారు. ఇంటి పెద్దదిక్కును కొల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని కుటుంబ సభ్యులు దీనంగా వేడుకుంటున్నారు. ఇలా ఒక నెలలో ఇద్దరు జిల్లా వాసులు గల్ఫ్‌లో మృతిచెందారు. 

శవం కోసం ఎదురు చూపులు

గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశం రప్పించడానికి ఎన్నారై పాలసీ లేకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఖర్చు భరించి మృతదేహాలను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తే దాదాపు నెల సమయం పడుతుంది.

ఎన్నారై పాలసీ ఉంటే వారం రోజుల్లో మృతదేహాలు స్వగ్రామాలకు తరలించే అవకాశం ఉంటుందని గల్ఫ్ కార్మిక నేతలు చెప్తున్నారు. గల్ప్‌లో నష్టపోయిన వారు, ఏజెంట్ల చేతిలో మోసపొయిన వారు, వారి కుటుంబాలు దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశం కల్గుతుంది. ఎన్నారై పాలసీ అమలు చేయాలని గల్ఫ్ బాధితులు కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నా..

రాజకీయ పార్టీలు దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మాత్రమే చూస్తున్నాయి. గత ప్రభుత్వం పదేళ్లుగా ఎన్నారై పాలసీ అమలు చేస్తామని ఊరిస్తూ వచ్చి ఊసురుమనిపించింది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు హమీ ఇచ్చింది. అమలులో ఎంత మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాల్సిందే.  

గల్ఫ్‌లో 25 వేలకు పైగా కామారెడ్డి వాసులు

ఓ వైపు గల్ప్ ఎజెంట్ల మోసాలు, మరోవైపు ఆరబ్ దేశాల్లో అమలవుతున్న ఆర్థిక పరమైనా కార్మిక చట్టాలు వలస కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 వేల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లారు. ఏళ్ల నుంచి వాళ్లు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, దుబాయ్, మస్కట్, ఖతార్, బైరాన్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు.

ఇప్పటికీ ప్రతి రోజు ఇక్కడి నుంచి చాలా మంది నిరుద్యోగ యువత గల్ఫ్ బాట పడుతూనే ఉన్నారు. అమాయక యువతనే టార్గెట్ చేసుకొని కొందరు ఏజెంట్లు, బ్రోకర్లు మోసాలు కూడా పెరిగాయి. తమ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కబెట్టేందుకు అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లినవారు అక్కడి పరిగల్ఫ్ బాటలో మృత్యువు వేట!స్థితులు తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. 

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి

వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకొవాలి. కేరళ తరహ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. ఏడాది వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. గల్ఫ్‌లో మరణించిన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలి. 

మహమ్మద్ ఫారుక్ ,

గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యుడు