calender_icon.png 23 December, 2024 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోలకు చావు దెబ్బ

07-09-2024 12:00:00 AM

రెండేళ్లలో దేశంలో మావోయిస్టులు అనే వారు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ ముహూర్తాన ప్రక టించారో కానీ కేంద్రం ఆ దిశగా దూసుకు పోతున్నది. కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్, రాష్ట్ర పోలీసు బలగాలతో మావోయిస్టులకు బలమైన స్థావరంగా ఉన్న బస్తర్  ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటుగా మహారాష్ట్రలోని దంతేవాడ, తెలంగాణలోని భద్రాచలం ఏజన్సీ జిల్లాలకు వ్యాపించిన ఈ ప్రాంతంలో ఇప్పుడు నిత్యం పోలీసుల తుపాకుల మోతలే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో150కి పైగా మావోయిస్టులు పోలీసు తూటాలకు బలయ్యారు.

ఛత్తీ స్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతం కావడం ఇదే మొదటిసారి. తాజాగా రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అడవుల్లో భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో  ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళా నక్సలైట్లు కూడా ఉన్నా రు. వీరంతా మావోయిస్టు పార్టీ బీకేఎఎస్‌ఆర్(భద్రాద్రి కొత్తగూడెంఅల్లూరి సీతారామరాజు) డివిజన్ కమిటీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు మృతుల్లో పార్టీ మణుగూరు లోకల్ గెరిల్లా స్కాడ్ కార్యదర్శి కుంజా వీరన్న అలియాస్ లచ్చన్నతో పాటుగా ఆయన భార్య  తులసి, కొత్తగా రిక్రూట్ అయిన కోసి అలియాస్ వెన్నెల, దుర్గేశ్, మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. కరకగూడెం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారందరిపైనా ప్రభుత్వం గతంలోనే రివార్డులు కూడా ప్రకటించింది.  ఘటనాస్థలిలో రెండు ఏకే47 తుపాకులు, ఎస్‌ఎల్‌ఆర్, పిస్టల్‌తో పాటుగా పెద్ద మొత్తంలో తూటాలు, కిట్‌బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. 

దీనికి మూడు రోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బీజపూర్ జిల్లాల సరిహద్దు ల్లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మహిళా నక్సలైట్లతో పాటు గా 9 మంది చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత మాచ ర్ల ఏసోబు అలియాస్ జగన్ కూడా ఉన్నాడు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ, మహారాష్ట్రఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు ఇన్‌చార్జిగా ఉన్న జగన్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంకు చెందినవాడు. 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన జగన్ అంచెలంచెలుగా  ఎదిగి  కీలక స్థానానికి చేరుకున్నాడు. ఈ రెండు ఎన్‌కౌంటర్లతో తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలిందని అంటున్నారు. 

నిజానికి ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటినుంచి ఎన్‌కౌంటర్లు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో మావోయిస్టుల ఏరివేతే పనిగా పెట్టుకున్నాయి. మరోవైపు ఒకప్పుడు ఉద్యమానికి కీలకంగా ఉండిన తెలంగాణలో తిరిగి బలపడాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం కూడా అంతే కృతనిశ్చ యంతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్‌కౌంటర్ ఇది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డినప్పటినుంచి ఇప్పటివరకు ఎన్‌కౌంటర్లలో 51మంది మావోయిస్టులు మృతి చెందగా, 302 మందికిపైగా పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసుల తూటాలకు బలైన వారిలో సాగర్ వంటి  అగ్రనేతలు ఉన్నారు. తెలంగాణలో మావోయిస్టులకు స్థానం లేదని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి జన జీవన స్రవంతిలో కలవాలని తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన చెప్పారు. మరోవైపు ఎన్‌కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఆరోపిస్తూ సహచరుల నెత్తుటికి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజన్సీ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.