calender_icon.png 23 December, 2024 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాస్‌కు చావుదెబ్బ

19-10-2024 12:00:00 AM

గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ భారీ విజయం సాధించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి సూత్రధారి, హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టింది. ఈ విషయాన్ని గురువారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాంట్జ్ ధ్రువీకరించారు.ఇజ్రాయెల్ దాడిలో తమ అధినేత మృతిచెందినట్లు హమాస్ కూడా ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్‌కు నైతికంగా ఘన విజయం.

సిన్వర్ ఏరివేతతో తక్షణం కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. సిన్వర్ మృతితో గాజాలో శాంతి నెలకొనడానికి ద్వారాలు తెరుచుకున్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు, మరికొద్ది రోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.

సిన్వర్‌ను హతమార్చి లెక్క సరిచేశామని, అయితే బందీలను సురక్షితంగా తీసుకువచ్చే దాకా యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడాన్ని చూస్తే ఆ ఆశలు లేవనే అనిపిస్తుంది. హమాస్ కూడా యుద్ధం ముగిసే దాకా బందీలను వదిలేది లేదని తేల్చి చెప్పింది. ఏడాదిగా జరుగుతున్న గాజా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ గ్రూపు ఒక్కరొక్కరుగా కీలక నేతలను కోల్పోతూ వస్తోంది.

గత జులైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను,సెప్టెంబర్‌లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు శత్రుసైన్యంలో మరో కీలక నేత అయిన సిన్వర్‌నూ హతమార్చింది. సిన్వర్ మృతి హమాస్‌కు పూడ్చలేని లోటనే చెప్పాలి. ఎందుకంటే ఆయన హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తి. శత్రువును అంచనా వేయడంలో దిట.్ట

ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఊచకోత ఘటనకు అతనే ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో హమాస్ ఉగ్రవాదులు 1200 మందికి పైగా ఇజ్రాయెల్ వాసులను హతమార్చిన విషయం తెలిసిందే. మరో 200 మందిని బందీలుగా పట్టుకెళ్లారు.

యాహ్యా అసలు పేరు యాహ్యా ఇబ్రహీం హస్సన్ సిన్వర్.1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఓ శరణార్థి శిబిరంలో పుట్టాడు. అతడి పూర్వీకులు 1948వరకు దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. అప్పట్లో ఆ ప్రదేశం ఈజిప్టు అధీనంలో ఉండేది. ఆ తర్వాత సిన్వర్ కుటుంబం గాజాకు తరలివెళ్లింది.

అతను గాజా విశ్వవిద్యాలయంనుంచి అరబిక్ స్టడీస్‌లో డిగ్రీ చేశాడు. 1982లో విధ్వసక చర్యలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణపై తొలిసారి అరెస్టయిన సిన్వర్ రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైళ్లలోనే ఉన్నాడు.1985లో జైలునుంచి విడుదలైన సిన్వర్ మరో వ్యక్తితో కలిసి‘మజ్ద్’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

కొత్తగా ఏర్పడిన హమాస్‌లో అది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకున్న వారిని హత్య చేసినట్లు మజ్ద్  అభియోగాలు ఎదుర్కొంది. దీంతో సిన్వర్ మరోసారి అరెస్టయ్యాడు. 1989 లో జీవిత ఖైదు పడింది. పలుమార్లు జైలునుంచి తప్పించుకోడానికి యత్నించి దొరికిపోయాడు కూడా.

2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం ఇజ్రాయెల్ 1026 మందిని విడుదల చేయాల్సి వచ్చింది. వారిలో సిన్వర్ కూడా ఉన్నాడు. అలా జైలు నుంచి బయటపడ్డ తర్వాత అతను హమాస్‌లో చాలా వేగంగా అగ్రనేత గా ఎదిగాడు. అమెరికా విదేశాంగ శాఖ 2015లోనే  సిన్వర్‌ను ఉగ్రవాది గా ప్రకటించింది.

2017లో హమాస్ అధిపతిగా ఎన్నికయ్యాడు. సిన్వర్‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ చాలా రోజులుగా గాలిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దాడులనుంచి తప్పించుకోవడానికి అతను బందీల మధ్యనే ఉండే వాడని కూడా వార్తలు వచ్చాయి.

అయితే బుధవారం తాము జరిపిన దాడిలో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు బందీల మధ్య లేరని ఇజ్రాయెల్ సైన్యం వివరణ ఇచ్చింది. సిన్వర్‌ను హతమార్చడంతో ఇజ్రాయెల్  హమాస్ అగ్రనేతలందరినీ హతమారుస్తామన్న ప్రతిజ్ఞను దాదాపుగా నెరవేర్చుకుంది.