calender_icon.png 19 November, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాస్‌కు చావుదెబ్బ

01-08-2024 12:00:00 AM

గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌తో గత అక్టోబర్‌నుంచి  పోరాటం చేస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌లో ఆ సంస్థ అధినేత ఇస్మాయిల్ హనియా దారుణ హత్యకు గురయ్యారు. ఇస్మాయిల్ లక్ష్యంగా మంగళవారం తెల్లవారు జామున జరిగిన దాడిలో ఆయన భద్రతా సిబ్బంది ఒకరు కూడా చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది. ఇది ఇజ్రాయెల్ చేసిన దాడిగా హమాస్ అభివర్ణించింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు షెజెస్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరై టెహరాన్‌లోని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఇరాన్ ఆదేశించడమేకాక తమ భూభాగంలో జరిగిన హనియా మృతికి ప్రతీకారం తీర్చు కుంటామని కూడా ప్రకటించింది.

దీంతో రాబోయే రోజుల్లో గాజా ప్రాం తంలో పోరు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో 40 వేలమందికి పైగా అమాయక పౌరులు మృతి చెందారు. హనియా మృతి హమాస్ సంస్థకు కోలు కోలేని దెబ్బే. గాజా ప్రాంతంలో హమాస్ పట్టు సాధించడానికి ముఖ్య కారకుడు ఆయనే. గాజా నగరానికి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మిం చిన 62 ఏళ్ల హనియా అంచెలంచెలుగా హమాస్ చీఫ్ స్థాయికి ఎదిగారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధం సమయంలో హమాస్‌లో చేరిన హని యా పేరు 1983లో  వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్‌కు కుడి భుజంగా మారిన ఆయన సంస్థలో అనేక బాధ్యతలు నిర్వ హించారు.

2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ హతమైన తర్వాత హమాస్‌లో కీలకంగా మారారు. రెండేళ్ల తర్వాత పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్ పాలన చేపట్టారు. అయితే, ఏడాదిలోపే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయనను పదవినుంచి తొలగించారు. అప్పటినుంచి వెస్ట్‌బ్యాంక్‌పై ఆధిపత్యం కోసం ఫతా, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గాజా ప్రధానిగా కొనసాగిన హనియా 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా హనియాను మోస్టు వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో చేర్చడంతో ఆయన గాజా నగరం వీడి ఖతార్, టర్కీలో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్, టర్కీలో పర్యటించి ఆయా దేశాధినేతల మద్దతుకు యత్నించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు, నలుగురు మన వళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది. 

గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మూకుమ్మడి మారణహోమానికి పాల్పడిన తర్వాత హనియాను మట్టుబెడతామ ని, హమాస్‌ను తుడిచివేస్తాని ఇజ్రాయెల్  ప్రకటించింది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతోనే ఆయనను మట్టుబెట్టిందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు హనియా మృతిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు మౌనంగా ఉంది. వాస్తవానికి ఖతర్‌లో ఉన్నంతకాలం హనియాకు ఎలాంటి హానీ జరలేదు. ఇప్పుడు ఇరాన్ భూభాగంలో ఆయనపై దాడి జరగడంతో దానికి బాధ్యత స్వీకరించేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాగా హని యా మృతితో ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ చర్చల కు బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు.

ఎందుకంటే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ చర్చలు హని యా కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మరోవైపు హమాస్‌కు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ,ఆర్థిక, సైనిక మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర ఆయనదే.  ఆయన హయాంలోనే గాజాపై హమాస్ పూర్తి పట్టును సాధించింది. ఇప్పు డు హనియా మృతితో హమాస్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరు పగ్గాలు చేపట్టినా గతంలో లాగానే ఆ సంస్థకు ఇరా న్, ఖతార్ లాంటి అరబ్ దేశాల మద్దతు ఉంటుందా అనేది వేచి చూడాల్సిం దే. ఇప్పటిదాకా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్, గాజా ప్రాంతంలో హమాస్‌తో కలిసి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఇరాన్ వ్యూహం ఇకపై ఎలా ఉండబోతున్నదో వేచి చూడాలి. అన్నిటికీ మించి ఇప్పటిదాకా ఈ వివాదంలో ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్న అమెరికా వైఖరి ఇకపై ఎలా ఉండనుందనేది అసలు ప్రశ్న.