- ఖమ్మం జిల్లాలో వారం వ్యవధిలో డెంగ్యూ బారిన పడి పదిమంది మృతి
- మృతుల్లో ఆరుగురు సత్తుపల్లి ప్రాంతం వారే..
- అనధికారికంగా యాక్టివ్‌గా మరో 500 కేసులు
- కేసులను తక్కువ చేసి చూపుతున్న వైద్యారోగ్యశాఖ?
- దవాఖానల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత
ఖమ్మం, ఆగస్టు 25 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం.. పారిశుధ్యం లోపం వెరసి ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డెంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఇప్పటికే డెంగ్యూ బారిన పడి 10 మంది మృత్యువాత పడ్డారు. జిల్లావ్యాప్తంగా మరో 500 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసులకు వైద్యాధికారులు వెల్లడిస్తున్న గణాంకాలకు సంబంధం లేకుండా కేసులు నమోదవుతుండడం గమనార్హం. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల ఒక్కో బెడ్‌పై ఇద్దరేసి రోగులు చికిత్స తీసుకుంటున్నారు.
ఈ ప్రాంతాల్లో కేసులు ఎక్కువ..
ఖమ్మం నగరంతో పాటు తిరుమలాయపాలెం, ఏన్కూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల్లో జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉంది. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి, పెనుబల్లి మండలం గంగదేవిపాడు, బ్రాహ్మణకుంట, కొత్త కారాయిగూడెం, పెనుబల్లి, ఏన్కూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటికొకరు మంచం పట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు వచ్చి, డ్రైనేజీల్లో మురుగు నిల్వ ఉండడంతో దోమలు పుట్టుకొచ్చాయి.
దోమలు కుట్టడంతో ప్రజలు డెంగ్యూతో ఇతర విష జ్వరాల బారిన పడుతున్నారు. ఒక్క పెనుబల్లి మండలంలోనే వారం రోజుల్లో డెంగ్యూతో ఐదుగురు, గంగదేవిపాడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో ఇప్పటివరకు 385 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య 500కి పైగానే ఉందంటున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
నిరుపేదలు ఎక్కువగా వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కారణంగా మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో కొందరు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర అనారోగ్యం బారినపడి క్షోభ అనుభవిస్తుండడం చూడలేక కొందరు వారిని హైదరాబాద్ వంటి నగరాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సత్తుపల్లి, పెనుబల్లి ఏరియాలో గిరిజనులు ఎక్కువగా ఉండడం, వారికి విష జ్వరాల పట్ల అవగాహన లేకపోవడంతో వాటి బారిన పడుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య చర్యలు పక్కాగా చేపట్టకపోవడంతో జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. చిన్న, పెద్ద.. అనే తారతమ్యం లేకుండా ప్రతి దవాఖానలో ఔట్ పేషెంట్ల సంఖ్య పెరిగింది.
విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయి..
గతేడాది కంటే ఈసారి డెంగ్యూ కేసులు సంఖ్య పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 27 మాత్రమే డెంగ్యూ కేసులు ఉన్నాయి. విష జ్వరాల బారిన పడిన వారి కోసం గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే అన్ని ఆస్పత్రులను తనిఖీ చేస్తాం.
సుబ్బారావు,
డీఎంహెచ్‌వో, ఖమ్మం