calender_icon.png 1 November, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేచి ఉన్న మృత్యువు

03-08-2024 05:00:01 AM

  1. హమాస్ నేత హనియే హత్యకు భారీ ప్లాన్
  2. గెస్ట్‌హౌస్‌లో 2 నెలల ముందే బాంబు సెట్
  3. ఆయన గదిలోకి రాగానే పేల్చేసిన మొసాద్

టెహ్రాన్, ఆగస్టు 2: ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ పథకాలు, శత్రువులను అంతమొందించేందుకు వేసే ఎత్తుల గురించి ఇప్పటికే కథనాలు కోకొల్లులగా ఉన్నాయి. ఇటీవల టెహ్రాన్ హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను అంతమొందించటంలో మొసాద్ తన మార్క్‌ను చూపించిందని తాజాగా వెల్లడైంది. మొసాద్ ఎవరినైనా టార్గెట్ చేసిందంటే.. అష్టదిగ్బంధనం చేసినట్టు కమ్ముకొస్తుంది. ఎటునుంచి ఏ రూపంలో వచ్చి మట్టుబెడుతుందో ఎవరూ ఊహించలేదు. హనియే హత్యను కూడా ఇరాన్‌లోనే అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా పసిగట్టలేకపోయింది. 

రెండు నెలల ముందే బాంబు

హనియేను టార్గెట్ చేసిన మొసాద్ చాలాకాలం నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు కదిలిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ ఇటీవల ప్రమాణం చేశారు. ఆ కార్యక్రమానికి వచ్చిన హనియేకు ఓ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేశారు. దీనికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ రక్షణగా ఉంటారు. వారి కన్నుగప్పి చీమ కూడా లోపలికి పోలేదని చెప్తుంటారు. అయినా, ఆ గెస్ట్‌హౌస్‌లో మొసాద్ ఏజెంట్లు రెండు నెలల ముందుగానే శక్తిమంతమైన బాంబు అమర్చారు.

టైమర్‌తో పేల్చగలిగే ఆ బాంబును అత్యంత రహస్యంగా ఇరాన్‌లోకి స్మగ్లింగ్ చేసి సరిగ్గా హనియే బసచేసే గదిలోనే అమర్చడం విశేషం. ఇక్కడ ఇరాన్ అధికారులు చేసిన తప్పదమల్లా హినియే ఎప్పుడు టెహ్రాన్‌కు వచ్చినా అదే గెస్ట్‌హౌస్‌ను కేటాయించటం. దీంత హనియే కచ్చితంగా ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఉంటారని నిర్ధారణకు వచ్చిన మొసాద్ ఏజెంట్లు విజయవం తంగా తమ ప్రణాళికను అమలుచేశారు.

తప్పని గురి

హనియే బసచేసిన గెస్ట్‌హౌస్‌లో చాలా గదులే ఉన్నట్టు సమాచారం. అయినా గురితప్పకుండా బాంబు పేల్చి ఆయనను చంపేయగలిగారు. హనియే తాను ఉండే గదికి రావటం, వెంటనే బాంబు పేలటం రెప్పపాటులో జరిగిపోయాయని సమాచారం. బాంబు ధాటికి గెస్ట్‌హౌస్ కదిలిపోయిందని, భవనం బయటి గోడలు కూడా బీటలువారాయని తెలిసింది. ఇంత కచ్చితమైన టైమింగ్‌తో దాడి చేయాలంటే మొసాద్ ఏజెంట్లు ఎవరో ఒకరు కచ్చితంగా గెస్ట్‌హౌస్ లోపల ఉండే ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, హనియే అంత్యక్రియలు ఖతార్‌లో శుక్రవారం నిర్వహించారు. 

టెల్ అవీవ్‌కు విమానాలు రద్దు 

గాజా యుద్ధంతోపా టు తాజాగా హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే, హెజ్బొల్లా కమాండర్ ను ఇజ్రాయెల్ చంపేయటంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. గగన తలానికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ వరకు అక్కడికి విమానాలు నడుపబోమని శుక్రవారం ప్రక టించింది. ఇప్పటికే టికెట్లు బుక్‌చేసుకొ న్న ప్రయాణీకులకు చార్జీలు తిరిగి చెల్లిస్తామని, రీసెడ్యూల్, క్యాన్సిలేషన్ చార్జీ లు వసూలు చేయబోమని తెలిపింది.