calender_icon.png 18 January, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోమారు డీలా

16-09-2024 04:38:28 AM

  1. రెండో రౌండ్‌లో కూడా ఓడిన శ్రేయస్ సేన
  2. భుయ్ సెంచరీ చేసినా.. తప్పని ఓటమి
  3. డ్రాగా ముగిసిన ఇండియా బీ x  సీ మ్యాచ్

అనంతపూర్: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా డీ జట్టు దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ పోటీలలో కూడా ఓడిపోయింది. ఇండియా ఏ తో జరిగిన మ్యాచులో 186 పరుగుల భారీ తేడాతో డీ జట్టు ఓటమి చెందింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా కానీ డీ జట్టు ఓడిపోవడం గమనార్హం. మొదటి రౌండ్ మ్యాచ్‌తో పాటు ఈ మ్యాచ్‌లో కూడా ఓట మి చెందింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్న డీ జట్టు ఇండియా ఏ ను కట్టడి చేయడంలో విఫలం అయింది. 

150లోపే ఆరు.. 

బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఏ జట్టు 144 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన శ్యామ్స్ ములానీ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లతో కలిసి ఇండియా ఏ కు 290 ప రుగుల స్కోరును అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హర్షిత్ రానా 4 వికెట్లతో సత్తా చా టాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన ఇండియా డీ జట్టు దారుణ ప్రదర్శన కనబర్చింది. పడిక్కల్ (92) మినహా  అంత చేతులెత్తేయడంతో 183 పరుగులకే చాపచుట్టేసింది. ఖలీల్, ఖాన్ చెరి మూడు వికెట్లతో ఇండియా డీ పతనాన్ని శాసించారు. 

తెలివైన ఎత్తుగడ.. 

100 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఇండియా ఏ రెండో ఇన్నింగ్స్‌లో తెలివైన ఎత్తుగడ వేసి సఫలం అయింది. త్వరత్వరగా ఆడి ఇన్నింగ్స్‌ను 100 ఓవర్లలోపే డిక్లేర్ చేసింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ (122), తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (111*) సెంచరీలు బాదడంతో ఇండియా ఏ జట్టు 380 పరుగులు చేసింది. డీ జట్టు బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. ఇక కొండంత లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రేయస్ సేన ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.

ఒక్క రికీ భుయ్ మాత్రమే సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఇండియా ఏ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఇండియా డీ కి మరో ఓటమి తప్పలేదు. చివరికి ఇండియా డీ జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయి 186 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇండియా ఏ ఆటగాడు శ్యామ్స్ ములానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 

డ్రాగా ముగిసిన మ్యాచ్

ఇండియా బీ, ఇండియా సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియా బీ 332 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్సులో ఇండియా సీ జట్టు 128 వద్ద డిక్లేర్ చేసినా కానీ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించి డ్రాగా ప్రకటించారు. ఇండియా సీ జట్టుకు చెందిన అన్షుల్ కంబోంజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ & బౌలింగ్ చేసిన కంబోంజ్ 38 పరుగులు చేయడమే కాకుండా 8 వికెట్లతో సత్తా చాటాడు. 

అసలెవరీ ములానీ.. 

ప్రస్తుతం చాలా మంది ములానీ ఎవరు అని ఆరా తీస్తున్నారు. మొదటి రౌండ్ మ్యాచ్ ఆడని ములానీ భారత జట్టుకు ఎంపికయిన కుల్దీప్ యాదవ్ స్థానంలో వచ్చాడు. వచ్చీ రావడంతో తానేంటో నిరూపించుకున్నాడు. బంతితో మాత్రమే కాదు.. బ్యాటుతో కూడా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేయడమే కాకుండా విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కీలక దశలో మూడు వికెట్లు నేలకూల్చాడు. ములానీ కూడా ముంబైకరే కావడం విశేషం.