calender_icon.png 26 December, 2024 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్తూపం భూములపై వీడని ప్రతిష్టంభన

26-12-2024 02:22:04 AM

  1. * హుస్నాబాద్‌లోని స్థలాలపై పట్టువదలని మావోయిస్టులు
  2. * వాటిని అమ్ముకున్నోళ్లు తిరిగిఇవ్వాలని డివిజన్ కమిటీ లేఖ
  3. * లేకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరిక
  4. * ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటున్న  కాంగ్రెస్ నేతలు

హుస్నాబాద్, డిసెంబర్ 19: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అమరుల స్తూపం భూముల వ్యవహరం ఏండ్లుగా కొలిక్కిరావడం లేదు. ఆయా భూమలును కొనుగోలు చేసినవారు తిరిగిచ్చేయాలని ఓ వైపు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తుంటే.. ఆయా స్థలాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు ప్రతిపాదనలు పెడుతున్నారు. మరోవైపు ఆ భూములను అమ్ముకున్నోళ్లు, కొనుగోలు చేసిన రియల్టర్లు కూడా పంతం నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు స్తూపం భూములను పేదలకు పంచే రాజకీయ పార్టీకే మద్దతు ఇవ్వాలనే నినాదాలు కూడా పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు అన్నల నీడలో పోలీసుల నిఘాలో నిత్యం తల్లడిల్లిన హుస్నాబాద్ పల్లెల్లో మళ్లీ మావోయిస్టుల లేఖలతో భూస్వాములు, రియల్టర్లలో భయం మొదలైంది. 1990, అక్టోబర్ 25న హుస్నాబాద్‌లోని అక్కన్నపేట రోడ్డులో అప్పటి పీపుల్స్‌వార్ అమరుల యాదిలో స్తూపాన్ని ఆవిష్కరించింది. 1989 నుంచి ఏడాదిపాటు అప్పటి పీపుల్స్‌వార్ ప్రతినిధులు, సానుభూతిపరులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నుంచి విరాళాలు సేకరించారు.

ఆ డబ్బులతో 1972 మధ్యకాలంలో రాజ్యం జరిపిన ఎదురుకాల్పుల్లో అమరులైన 88 మంది పీపుల్స్‌వార్ అమరవీరుల స్మారకార్థం 88 అడుగుల ఎత్తున స్తూపాన్ని నిర్మించారు. 

దొరల ఆయువుపట్టులో..

ఈ స్తూపాన్ని హుస్నాబాద్‌లో నిర్మించడం వెనుక భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలున్నాయి. హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, జనగామ జిల్లాల మధ్యలో ఉంటుంది. దీంతో పాటు కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి పదవిని అలంకరించిన పీవీ నరసింహారావుది కూడా ఇదే నియోజకవర్గం కావడం విశేషం. అప్పుడు పీపుల్స్‌వార్‌పై కేంద్ర ప్రభుత్వ అవగాహన కోసం మేథో మార్గదర్శకత్వం పీవీదే కావడంతో ఆయన కోటలోనే పీపుల్స్‌వార్ స్తూపాన్ని నిర్మించి సవాల్ విసిరింది.

అక్కన్నపేటలో దొరలను తరిమేసి, అదే రోడ్డులో స్తూపాన్ని నిర్మించారు. చైనాలోని తియన్మాన్‌స్కైర్ తర్వాత ఈ స్తూపం ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద స్తూపంగా గుర్తింపు పొందింది. నల్ల ఆదిరెడ్డి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సమయంలో ఈ స్తూపాన్ని యాంటీ నక్సలైట్లు పేల్చివేశారు. 

పేదలకు భూములు ఇవ్వాలనుకొని..

ఈ స్తూపాన్ని ఆనుకొని దివంగత డీఎస్పీ ముత్తినేని రామచంద్రారెడ్డికి చెందిన నాలుగెకరాల భూమిని అప్పుడు పీపుల్స్‌వార్ తీసుకుంది. సర్వే నంబర్ 1189లోని ఆ భూమిని రామచంద్రారెడ్డి పీపుల్స్‌వార్‌కు రాసి ఇవ్వడంతో పీపుల్స్‌వార్ ఆ స్థలాన్ని పేదలకు ఇవ్వాలనుకున్నారు. దాన్ని స్వాధీనం చేసుకొని పార్టీ కేంద్ర కమిటీకి అప్పగించారు.  ఇప్పుడు ఆ స్థలాన్ని రామచంద్రారెడ్డి కొడుకు ముత్తినేని రాజేశ్వర్‌రెడ్డి రూ.25 కోట్లకు అమ్ముకున్నాడని సీపీఐ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ తాజాగా మీడియాకు పంపిన లేఖలో ఆరోపించారు.

సదరు భూమిని ఎవరెవరికీ అమ్మింది కూడా పేర్లతో సహా వెల్లడించారు. ఆ భూములను వదిలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దీంతో ఈ ప్రాంత దోపిడీదార్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడుకోవాలని పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ వద్ద ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ భూముల సమస్యను కాంగ్రెస్ హయాంలో పరిష్కరిస్తే పార్టీకి మైలేజీతోపాటు ప్రజాప్రతినిధులకు క్రెడిట్ దక్కుతుందని మంత్రితో అన్నట్టు తెలుస్తోంది.  

ఉద్యమం బలహీనపడడంతో.. 

ఉద్యమం బలహీనపడడంతో 2022, డిసెంబర్‌లో ఆ భూమి పట్టాదారుడిగా ఉన్న దివంగత డీఎస్పీ రామచంద్రారెడ్డి కొడుకు రాజేశ్వర్‌రెడ్డి 4 ఎకరాలు స్తూపానికి ఇచ్చిన భూమిని రూ.25 కోట్లకు కాంతాల రాజేందర్‌రెడ్డి (కిసాన్ ఫర్టిలైజర్ దుకాణం), అబ్బరబోయిన సహదేవ్(గుబ్బడి), బాబురావు(మాజీ పట్వారీ), క్యాస రాము(జగదాంబ రెస్టారెంట్), సన్నీ శ్రీను(వ్యాపారి), కొండూరి శ్రీకాంత్(వ్యాపారి), బెగజం శ్రీను(వ్యాపారి), మార్గం రవీందర్(వెహికిల్ ఇన్‌స్పెక్టర్), గుండా శ్రీను, కొత్త శ్రీనివాస్‌లకు అమ్మాడు.

వీళ్లందరూ స్తూపానికి చెందిన 4 ఎకరాల భూమిని ప్లాట్లు పెట్టి అమ్ముతున్నారు. ఆ భూమిని కొనుగోలుచేసిన వారందరూ వెంటనే డబ్బులు వాపస్ తీసుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.