calender_icon.png 26 October, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లపై తొలిరోజే ప్రతిష్టంభన

26-10-2024 01:11:35 AM

  1. ఆదిలాబాద్‌లో మద్దతు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
  2. తేమ సాకు చూపి వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని ఆగ్రహం
  3. కలెక్టర్ వాహనం అడ్డగింత.. కిసాన్ చౌక్‌లో రాస్తారోకో
  4. న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు వేడుకోలు

ఆదిలాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన తొలిరోజు శుక్రవారమే ఆదిలాబాద్ ఏఎంసీ పరిధిలో ప్రతిష్టంభన నెలకొన్నది. ఆరుగాలం కష్టపడి పంట దిగుబడిని చేజిక్కించుకున్న పత్తి రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారులు తేమ సాకుతో మద్దతు ధర తగ్గించడంపై మండిపడ్డారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలుకు నిరాకరించడం, వ్యాపారులు సీసీఐ కంటే తక్కువ ధర నిర్ణయించడం ఆందోళనకు దారి తీసింది. ఉదయం ప్రారంభమైన రాస్తారోకో సాయంత్రం వరకు కొనసాగింది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కలెక్టర్ రాజరి షా, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, సీసీఐ అధికారులు, వ్యాపారస్తులు, రైతు సంఘాల నాయకులు, రైతుల సమక్షంలో ఉదయం పత్తికి అధికారికంగా వేలం ప్రారంభమైంది.

సీసీఐ మద్దతు ధర కింటాకు రూ. 7,521 ఉండగా, తొలుత వేలం రూ.6,900 వద్ద ప్రారంభమైంది. చివరకు ఆ ధర కింటాకు రూ.7,150 పలికి.. అక్కడే నిలిచిపోయింది. సీసీఐ కంటే వ్యాపారులు ధర తక్కువగా నిర్ణయంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఓ పత్తి ట్రాక్టర్‌లో సిబ్బంది తేమను నాలుగు వైపులా పరిశీలించారు. ఏకంగా ఒక్కో భాగంలో ఒక్కో రీతిలో తేమశాతం నమోదైంది.

అధికంగా 50 శాతం తేమ చూపించడంతో సీసీఐ అధికారులు ఆ లాట్ పత్తి కొనుగోలుకు నిరాకరించారు. 8 నుంచి 12 శాతం మధ్యలో ఉంటేనే కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉందని అధికారులు చెప్పడంతో కొనుగోళ్లలో సందిగ్ధం నెలకొన్నది. ఇక ప్రైవేటు వ్యాపారులు సైతం కింటాకు రూ.7,150 మాత్రమే ధర నిర్ణయించారు.

వీరికి పత్తి విక్రయిస్తే 8 శాతం పైన తేమ ఉంటే కిలోకు రూ.71 చొప్పున కోత విధించే అవకాశం ఉంది. దీంతో భారీగా నష్టపోతామని భావించిన రైతులు ఏఎంసీకి తెచ్చిన పత్తిని విక్రయించలేదు. తేమతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేయగా, అందుకు వ్యాపారులు అంగీకరించలేదు.

రైతులు తపనిసరి పరిస్థితుల్లో నిరసనకు దిగారు. ఒక దశలో కలెక్టర్ రాజర్షి వాహనాన్ని సైతం అడ్డుకొని నిరసన చేపట్టారు. ఓ రైతు తమకు న్యాయం చేయాలంటూ ఏకంగా కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. అనంతరం వందలాది మంది రైతులు మార్కెట్ నుంచి బయల్దేరి పట్టణంలోని కిసాన్ చౌక్ కు చేరుకున్నారు.

అక్కడి పాత జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాత్రి 7 గంటల వరకు రైతుల ఆందోళన కొనసాగింది. 

ఏనుమాముల మార్కెట్‌లో నిలిచిన కాంటాలు

జనగామ, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పత్తి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదంటూ  శుక్రవారం రైతులు ఆందోళన బాట పట్టడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో కొన్ని గంటల పా టు కాంటాలు నిలిచిపోయాయి. దీంతో ప త్తి కొనుగోలు ప్రక్రియకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. రైతులు తెలిపిన వివరా ల ప్రకారం... రైతులు భారీగా పత్తి తీసుకొచ్చారు.

వ్యాపారులు చాలా తక్కువ రేటుకే పత్తి కొంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా రైతు సంఘాల నేతలు మార్కెట్‌కు వచ్చా రు. వ్యాపారులు సైతం రైతులు చెప్పిన రేటుకు కొనుగోలు చేయబోమని మొండికేశారు. దీంతో కాంటాలు ఎక్కడికక్కడే నిలి చిపోయాయి.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు కాంటాలు ముందుకు కదలకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రైతులు, రైతు సంఘాల నాయకులను బుజ్జగించారు. మార్కెట్ కార్యదర్శి నిర్మల ప్రత్యేక చొరవ తీసుకుని రైతు సంఘాల నాయకులు, పత్తి వ్యాపారులతో చర్చలు జరిపారు.

చర్చలు సఫలం కావడంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొనుగోళ్ల ప్రక్రి య షురూ అయింది. క్వింటాకు రూ.7 వే ల మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు చేసిన ట్లు సమాచారం. ఉదయం తెచ్చిన పత్తిని మధ్యాహ్నం కొనుగోలు చేయడంతో బరు వు తగ్గి తమకు మరింత నష్టం జరిగిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.