10-03-2025 08:12:21 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు సోమవారం సాయంత్రం ముగిసింది. తెలంగాణలో 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖాలు చేశారు. కాంగ్రెస్ తరుపున ముగ్గురు, బీఆర్ఎస్, సీపీఐ తరపున ఒక్కో నామినేషన్, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల మద్దుతుతో పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో పొత్తు పెట్టుకోగా, రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరింది. అందులో భాగంగానే కాంగ్రెస్ వచ్చే నాలుగు సీట్లలో ఒక ఎమ్మెల్సీని సీపీఐ పార్టీకి కేటాయించింది. దీంతో సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలుచేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించారు. దాసోజ్ నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లా రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.