20-03-2025 02:25:45 AM
ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చెవ్యూరు హరికిరణ్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 2 వరకు పెంచుతూ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్) లిమిటెడ్ బుధవారం ఉత్తర్వులిచ్చింది. గతనెల 24న కొత్త మద్యం, బీర్ల కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ టీబీజీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది.. మార్చి 15 వరకు అర్జీలు స్వీకరించాలని నిర్ణయించారు. దీంతో 39 వరకు దరఖాస్తులొచ్చాయి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానిస్తున్నారు. గతంలో మద్యం సరఫరాకు వివిధ కంపెనీలు కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి అనుమతిచ్చేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొత్త కంపెనీలే కాకుండా ఇప్పటికే మద్యాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలు కూడా కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీజీబీసీఎల్ పేర్కొంది.
టీజీబీసీఎల్‌లో రిజిస్ట్రర్ కాని కొత్త కంపెనీలు, ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలను నాణ్యత ప్రమాణాలతో జరుపుతున్నట్టు, మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేనట్టు నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రాన్ని జత చేయాలని టీజీబీసీఎల్ పేర్కొంది. సర్టిఫికెట్లు జతచేయడం ఆలస్యమవుతుందని, గడువు కావాలని కంపెనీలు కోరడంతో ఏప్రిల్ 2 వరకు గడువు పెంచినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.