నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరిలో దూకిన కుటుంబం
కామారెడ్డి, నవంబర్ 7 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పలించి వేణు(54), భార్య అనురాధ, కూతరు పూర్ణిమతో కలిసి నిర్మల్ జిల్లా బాసర వద్ద గల గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అను రాధను జాలర్లు కాపాడగా.. వేణు, పూర్ణిమ నదిలో గల్లంతయ్యారు. బుధవారం రాత్రి వేణు మృతదేహం లభ్యమవగా, గురువారం పూర్ణిమ మృతదేహం లభ్యమైంది.
త్వరలోనే కూతురు పెళ్లి.. ఇంతలోనే ఇలా
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురుకు చెందిన ఉప్పలించి వేణు(54), అనురాధ(50) దంపతులు ఇరువై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నిజామాబాద్‌కు వెళ్లారు. వారికి ఇద్దరు కుమార్తెలు. న్యాల్‌కల్ రహదారి పక్కన కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఒక పాన్ షాప్ కూడా ఉంది. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా.. నాలుగేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడింది. వీరికున్న పాన్‌షాప్ మొదటిగా బాగానే నడిచింది. రానూ రానూ నష్టాలు రావడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.
దీంతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షల అప్పు తీసుకున్నారు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తునే ఉన్నారు. అయితే మొత్తం అప్పు చెల్లించాలని లేదంటే భార్య, కూతురును అందరిలో వివస్త్రలను చేస్తామని వ్యాపారులు వేణును బెదిరించారు. అయితే పూర్ణిమకు ఇటీవలే నిశ్ఛితార్థం అయ్యిందని, కొన్ని రోజుల్లో అప్పు మొత్తం తీర్చేస్తామని వేడుకున్నా వడ్డీ వ్యాపారులు వినలేదు. దీంతో మనస్తాపానికి గురైన వేణు.. భార్య అనూరాధ, కూతురు పూర్ణిమ తో కలిసి బుధవారం బాసరలో గోదావరి నదిలో దూకేశారు.
అనురాధ నీటి ప్రవాహనికి స్నానాల ఘాట్ వరకు కొట్టుకురాగా కొందరు ఆమెను కాపాడారు. తండ్రీ కూతు రు గల్లంతయ్యారు. కాగా వేధింపులకు గురిచేసిన వడ్డీ వ్యాపారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.