06-04-2025 08:04:45 PM
మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తీగల్ పహాడ్ లో గల పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ ను ఆదివారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్ఓ) బ్రహ్మరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రేషన్ దుకాణాలకు తరలించేందుకు లారీలో లోడ్ చేస్తున్న సన్న బియ్యం బస్తాలు తడిచాయి. వాటిని తిరిగి ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ లో ఆరబోయగా ఆ బియ్యాన్ని పరిశీలించారు.
హమాలీలతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొన్నారు. లారీల్లో బియ్యం లోడింగ్, అన్ లోడింగ్ చేసే సమయంలో తప్పకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో సంబంధిత వాహన యాజమాని ఉంచినప్పుడే పని చేయాలని హమాలీలకు సూచించారు. సుమారు 30 క్వింటాళ్ల మేరకు బియ్యం బస్తాలు తడిచాయని, పూర్తిగా ఆరిన తర్వాతే బియ్యం రేషన్ దుకాణాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీసీఎస్ఓ వెంట అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) రజిత, ఎంఎల్ఎస్ పాయింట్ ఇంఛార్జీ శంకర్, డీఈఓ నాగరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు.