08-02-2025 07:26:44 PM
మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను శనివారం సాయంత్రం మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ... పోలీసులు భాదితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని కాలనీలలో నిత్యం పెట్రోలింగ్ చేయాలన్నారు.
అన్ని వార్డుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కాలనీ వాసులకి ప్రోత్సహించాలని, ఆక్సిడెంట్ జరగడానికి గల కారణాలు, బ్లాక్ స్పాట్స్, ఇతర కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆరోగ్య పరిస్థుతులు, వెల్ఫేర్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, ఎస్ ఐలు సంతోష్, లక్ష్మీ ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.