జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 2: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంబీర్’పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార అధికారి సిహెచ్.మనోజ్’కుమార్ పేర్కొన్నారు. సంఘ అధ్యక్షుడు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూమి కొనుగోలుపై సంఘ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా సహకార అధికారి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ పరిధిలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూమి కొనుగోలుకు సంబంధించిన అనుమతులను వెంటనే రద్దు చేశామన్నారు. అదే విధంగా ఈ వ్యవహారానికి సంబంధించి సంఘం అధ్యక్షునికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తామన్నారు.
సంఘ పరిధిలో ఎరువుల విక్రయాలను వెంటనే ప్రారభించాలని కార్యదర్శిని డీసీవో ఆదేశించారు. పాలకవర్గం వ్యవహారాల పై విచారణ చేస్తామని, రైతులు ఆందోళన విరమించాలని సూచించారు.
డీసీవో సూచనల మేరకు రైతులు తమ ఆందోళన విరమించారు. అంతకు ముందు ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ అంశంపై విచారణ జరపాలని డీసీఓకు సూచించారు.