calender_icon.png 16 January, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి పట్టుబడిన డీసీఎంఎస్ అధికారి

05-07-2024 12:05:00 AM

క్యాషియర్ సైతం..

కరీంనగర్, జూలై 4 (విజయక్రాంతి): లక్ష రూపాయల లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్‌రావు, క్యాషియర్ కుమారస్వామి ఏసీబీకి పట్టుబడ్డారు. డీసీఎంఎస్ ద్వారా 2018 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన కావటి రాజు అనే వ్యక్తికి అనుమతిలిచ్చారు. కేంద్రం ద్వారా వచ్చే కమీషన్‌లో సగం సంస్థకు, సగం ఏజెంట్‌కు ఇవ్వాలన్న ఒప్పందం ఉంది. కొనుగోళ్ల ద్వారా డీసీఎంఎస్ నుంచి రాజుకు రూ.90.16 లక్షలు రావాల్సి ఉండగా తన కమీషన్ ఇప్పించాలని మేనేజర్ వెంకటేశ్వర్‌రావును గత కొంతకాలంగా అభ్యర్థిస్తున్నాడు.

కమీషన్ ఇవ్వాలంటే ఎరువులు విక్రయించాలని మేనేజర్ కండీషన్ పెట్టడంతో రాజు ఎరువుల దుకాణం పర్మిషన్ తీసుకుని విక్రయాలు ప్రారంభించాడు. అంతే కాకుండా ప్రతీ లారీకి రూ.13 వేల చొప్పున ఇవ్వాలని మేనేజర్ ఒత్తిడి చేశాడు. ఎరువుల విక్రయం ద్వారా రావాల్సిన రూ.69 లక్షలకు పైగా కమీషన్ డబ్బులు ఇప్పించాలని జూలై 1న మరోసారి మేనేజర్ వెంకటేశ్వర్‌రావును రాజు అభ్యర్థించాడు. ఆయన కమీషన్‌కు నిరాకరించి, రాజుకు రావాల్సిన కమీషన్‌కు 15 లారీల ఎరువులు వస్తాయని, వాటిని అమ్ముకోవాలని సూచించాడు. అంతేకాకుండా మూడు లారీలకు ఒక లారీ చొప్పున తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీంతో రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంకటేశ్వర్‌రావు వద్దకు వెళ్లి మూడు లారీలకు ఒక లారీ చొప్పున లంచం ఇవ్వలేనని వేడుకోవాలని ఏసీబీ అధికారులు రాజుకు సూచించారు. మేనేజర్ వద్దకు వెళ్లిన రాజు తనకు రావాల్సిన కమీషన్ తాలుకు డబ్బు రూ.90లక్షల్లో రూ.23 లక్షల వరకు లంచంగా ఇవ్వవలసి వస్తుందని, తగ్గించాలని వేడుకున్నాడు. దీం తో లారీకి లక్ష రూపాయల చొప్పున 15 లారీలకుగాను రూ.15 లక్షలు ఇవ్వాలని దీంతో సంస్థ ఇచ్చే కమీషన్ కూడా చెల్లుతుందని చెప్పాడు. గురువారం లక్ష రూపాయలు చెల్లిస్తుండగా మేనేజర్ వెంకటేశ్వర్‌రావు, క్యాషియర్ సుదగోని కుమారస్వామిలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.