- మహిళ సహా ముగ్గురు దుర్మరణం
- దేవరకొండలోని పెద్ద దర్గా వద్ద దుర్ఘటన
నల్లగొండ, డిసెంబర్ 21 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దేవరకొండ పట్ట ణం పెద్ద దర్గా సమీపంలో శనివారం ఉద యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడిన వారిపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దేవరకొండలోని పెద్ద దర్గా సమీపంలో రోడ్డు వెంట కొబ్బరికాయలు విక్రయించే దుకాణం వద్ద ఉదయం పలువురు నిలబడి ఉన్నారు.
మల్లేపల్లి నుంచి కల్వకుర్తి వైపు అతి వేగం గా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి దుకాణం వద్ద నిలబడిన వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన కొబ్బరికాయల దుకా ణం నిర్వాహకుడు ఎండీ హాజీమియా (56), డిండి మండలం యర్రారం గ్రామానికి చెందిన షేక్ నభీన (25), నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్‌కు చెందిన ఎండీ అబ్దుల్ ఖాదర్ (19) ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
నాగర్ కర్నూల్ జిల్లా మేడిపూర్ కు చెందిన ఎండీ అన్వర్‌పాషాతోపాటు డిండి మండలం ఎర్రారానికి చెందిన సయ్యద్ అఫ్రిన్ షాకు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డీసీఎం దూసుకొచ్చిన వేగానికి దుకాణం సగభాగం ధ్వంసమైంది. ఓ ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయ్యింది. హాజీమియా భార్య జహంగీర్ భీ ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా డీసీఎం నడిపిన ఆంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ పోలీసులు తెలిపారు.