రుణమాఫీపై అనవసర రాద్ధాంతం
డీసీసీబీ అధ్యక్షులు అడ్డి బోజా రెడ్డి ధ్వజం...
ఆదిలాబాద్,ఆగస్టు 25(విజయక్రాంతి): రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను ఉసిగొలిపి రభస చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతల తీరుపై డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఫైర్ అయ్యారు. భోజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ బాద్నాం చేయాలని చూస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. రుణమాఫీపై ఆందోళనలు, ధర్నాలు చేస్తూ అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే తమ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అంటూ నిలదీశారు. అయినా మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. జోగు రామన్న, ఆయన చెంచాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు మారారంటూ తమపై విమర్శలు చేయడం తగదని, ఆ అర్హత మీకులేదని అన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు జోగు రామన్న పార్టీలు మారింది నిజంకాదా..? అంటూ ప్రశ్నించారు.