- దసరా తర్వాత జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీలు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతానికి పైగా
- హస్తగతం చేసుకునేలా కార్యాచరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ 90 శాతానికి పైగా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లే యోచనలో ఉన్నారు.
అందుకు జిల్లా కాంగ్రెస్ ( డీసీసీ) కమిటీ, నగర కాంగ్రెస్ ( సీసీసీ) కమిటీలు బలంగా ఉండాలనే అభిప్రాయంతో పీసీసీ చీఫ్ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. దసరా తర్వాత డీసీసీల నియామకం ఉండే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవుల్లో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 60 శాతం వరకు పదవులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను ప్రధానంగా పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాల పరిధి రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోపే పరిమితమైన విషయం తెలిసిందే.
ప్రభుత్వం అమలు చేస్తన్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉండటం, గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తుంటారు. శాసన సభ్యులు ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూనే.. మరో వైపు పార్టీ కార్యక్రమాలను కూడా చూసుకునే అవకాశం ఉంటుందని పీసీసీ నాయకత్వం భావిస్తోంది.
ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం లేని చోట.. బలమైన నాయకులకు డీసీసీ అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. డీ సీసీ కార్యవర్గంలోనూ అన్ని వర్గాలు, ప్రాంతాలుకు అవకాశమివ్వాలనే ఆలోచన చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో.. జిల్లా కమిటీ అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. డీసీసీ పదవులతోపాటు మండల, బ్లాక్ కాంగ్రెస్, గ్రామ స్థాయిల్లోనూ కమిటీలు వేయడం ద్వారా పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం కలుగుతుందని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఏడాది వ్యవధిలో గ్రేటర్, కార్పొరేషన్లు, పురపాలికల పదవీ కాలం కూడా ముగుస్తుంది. స్థానిక సంస్థల్లో పాగా వేస్తే.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయంతో ఉన్నారు.