అనుమతి లేని ఇంజక్షన్ల స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి) : జంటనగరాల్లోని పలు ఆస్పత్రుల్లో డీసీఏ (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్), ఎక్సైజ్ అధికారులు నిర్వహించన తనిఖీల్లో అనుమతి లేని ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ చంద్రాయణగుట్ట ప్రాంతంలోని బకోబన్ ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో గల బీవీకే.రెడ్డి ఆస్పత్రుల్లో డీసీఏ, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ ఆస్పత్రుల్లో ఎన్డీపీఎస్ లైసెన్స్ లేకుండా వినియోగిస్తున్న పెంటనాల్, కేటామిన్, మిడజోలం అనే ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
బకోబన్ ఆస్పత్రిలో 47 వాయిల్స్, బీవీకే.రెడ్డి ఆస్పత్రిలో 11వాయిల్స్, 21ఆంపిల్స్‌ను స్వాధీనం చేసకున్నారు. బీవీకే ఆస్పత్రి నిర్వాహకుడు టి.నరేష్ కుమార్, బకోబన్ ఆస్పత్రి నిర్వాహకుడు రహీమ్‌పై పీఎస్‌లో కేసు నమోదు చేశారు. దాడుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు బి.లక్ష్మీ, బి.గోవింద్‌సింగ్, చార్మినార్, ముషీరాబాద్ ఎక్సైజ్ సీఐలు శ్రీనివాసరావు, రామకృష్ణ, ఎస్సైలు శ్వేతకుమారి, ప్రసన్నరెడ్డి, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.