calender_icon.png 29 October, 2024 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్ పాకాలకు 2 రోజులు ఊరట

29-10-2024 02:04:11 AM

  1. నోటీసులపై స్పందించే వరకు కఠిన చర్యలు వద్దు
  2. పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  3. నవంబర్ 25కి విచారణ వాయిదా

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జన్వాడ ఫాం హౌస్‌లో జరిగిన పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకా ల రాజేంద్రప్రసాద్ (రాజ్ పాకాల)పై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించే వరకు తొందరపాటు చర్యలు వద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీసుల నోటీసులపై న్యాయవాది సాయంతో స్పం దించడానికి రాజ్ పాకాలకు రెండు రోజుల గడువు మంజూరు చేసింది. ఈ మేరకు మోకి లా పోలీసులు చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించింది.

సోమవారం ఉదయం 9.30కు నోటీసు అందజేసి, ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటే ఎలా? నోటీసుపై స్పందించడానికి తగిన గడువు ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించింది. నిస్పాక్షిక దర్యాప్తుపై సందేహాలు ఉన్నాయన్న పిటిషనర్ అభియోగాలకు ఈ నోటీసులు బలం చేకూర్చడం లేదా? అని అడిగింది.

ఈ నేపథ్యంలో నోటీసుపై పిటిషనర్ స్పందించేదాకా మోకిలా సీఐ, ఎస్సై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మోకిల స్టేషన్ హౌస్ ఆఫీసర్/సబ్ ఇన్‌స్పెక్టర్‌ను  ఆదేశించింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఆదేశాలను జారీచేశారు. ఒకవేళ ఏదైనా పార్టీలో డ్రగ్స్ వినియోగించిన వాళ్లు పట్టుబడితే వాళ్లకు చట్ట ప్రకారం పడే శిక్ష ఆరు మాసాలేనని, ఇలాంటి కేసుల్లో నోటీసులు జారీ చేయవచ్చు కదా అని విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేశారు.

లంచ్‌మోషన్ పిటిషన్

తనకు 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు నోటీసులు ఇచ్చి, 11 గంటలకే విచారణ కు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ రాజ్ పాకాల హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం కోర్టు ప్రారంభం కాగానే రాజ్ పాకా ల తరఫు సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని కోరారు.

భోజన విరామం తర్వాత విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి అంగీకరించారు. వాదనల తరువాత పిటిషనర్ విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు మంజూరు చేశారు. పోలీసులు హడావుడిగా దర్యాప్తు చేసి కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందంటూ పిటిషనర్ న్యాయవాది వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారు.  

దీపావళికి పేలుతుందన్న బాంబు ఇదేనా

కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా పోలీసులు అత్యుత్సాహంతో ఆ ఇంట్లో ఉన్న మహిళలను కూడా డ్రగ్స్ పరీక్షలు చేస్తామని పట్టుబట్టారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు.

మహిళలు, బంధువులు, స్నేహితులతో బలవంతంగా యూరిన్ టెస్ట్ చేయించారని, డ్రగ్స్ వినియోగించినట్టు ఏ విధమైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో పిటిషనర్‌ను కేసులో ఇరికించాలనే కుట్రకు తెరతీశారని అన్నారు. ఎలాగైనా కేటీఆర్ బావమరిదిని అరెస్టు చేయాలనే కుట్ర పూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

రాజకీయ ఒత్తిళ్ల మేరకే పోలీసులు  పనిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే కోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. రాజకీయ విభేదాలతో కేటీఆర్ బావమరిది అయిన కారణంగానే పిటిషనర్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు. రాష్ట్ర మంత్రి ఒకరు కేటీఆర్‌పై ఇటీవల తీవ్ర పదజాలంతో దారుణంగా మాట్లాడితే, ఆయన పరువు నష్టం దావావేశారని గుర్తు చేశారు.

మరో మంత్రి దీపావళి పండుగలోగా బీఆర్‌ఎస్ నేతలపై రాజకీయ బాంబు పేలుతుందని చెప్పారని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్ని బనాయించే చర్యలకు తెర తీసిందని ఆరోపించారు.  

రాజకీయ కక్షతోనే రాజ్ పాకాలపై కేసు 

తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బీ మయూర్‌రెడ్డి, న్యాయవాది విమల్ వర్మ వాసిరెడ్డి వాదించారు. రాజకీయ కక్షతో పిటిషనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. కొత్త ఇంట్లోకి వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి పండుగ వేళ ఇంట్లో బంధువులతో దావత్ చేసుకుంటే పోలీసులు భారీ సంఖ్యలో వచ్చి హంగామా చేశారన్నారు.

డ్రగ్స్ లేకపోయినా రేవ్ పార్టీ జరిగిందని, హాజరైన విజయ్ కొకైన్ తీసుకున్నట్టు తేలిందని చెప్పి పిటిషనర్‌ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని ముందుగానే పోలీసులు హెచ్చరిక చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాలోని రాజ్ పాకాల నివాసానికి మోకిల పోలీస్ ఇన్‌స్పెక్టర్ పేరిట 27వ తేదీతో ఉన్న నోటీసును 28వ తేదీన అతికించారని తెలిపారు.

కుటుంబసభ్యులతో పార్టీ చేసుకుంటుంటే పోలీసులు అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డారని, రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పి పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చడం అన్యాయమని చెప్పారు. ఈ నెల 26న ఇచ్చిన ఆతిథ్యానికి సీనియర్ సిటిజన్లు, పిల్లలు, మహిళలు హాజరయ్యారని.. ఆహారం, మద్యం అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్టు అక్కడ ఎలాంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు లేవని వాదించారు. 

విదేశీ మద్యం లభించింది  

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ ప్రతివాదనలు చేస్తూ.. పిటిషనర్‌కు పోలీసులు 41 ఎ నోటీసులు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. ఫాంహౌస్‌లో అక్రమంగా విదేశీ మద్యం సీసాలు లభ్యం అయ్యాయని చెప్పారు. అక్కడున్న మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలిందని పేర్కొన్నారు.

పిటిషనర్ విజయ్‌కి ఐదేళ్లుగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కేసు వెనుక రాజకీయ ఉద్దేశమే లేదని అన్నారు. పోలీసుల విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని మాత్రమే నోటీసుల్లో ఉందని, అరెస్టు చేయడమే పోలీసుల లక్ష్యం కాదని తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలు, సమాచారంతోనే కేసు దర్యాప్తు జరుగుతోందని, ఎవరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు ముందుకు వెళ్లడం లేదని చెప్పారు.

పిటిషనర్‌ను అరెస్టు చేసే ఆలోచన ప్రస్తుతానికి పోలీసులకు లేదని అన్నారు. పోలీసులు తీసుకునే చర్యలన్నీ చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి.. జన్వాడ ఫాంహౌస్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు పిటిషనర్ రాజ్ పాకాలకు హైకోర్టు రెండు రోజుల గడువును మంజూరు చేశారు. పోలీసులు నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలని ఆదేశించారు.