calender_icon.png 31 October, 2024 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15రోజుల ముందే హెచ్చరికలు!

01-09-2024 01:32:55 AM

  1. వరదల వార్నింగ్‌పై కొత్త మెకానిజం!
  2. ప్రస్తుతం 24గంటల ముందు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ
  3. దాన్ని అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఇప్పటివరకు 24గంటల ముందు వాతావరణ, విపత్తుల హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థలు మాత్రమే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. దీనివల్ల తక్కువ సమయంలో వరదల నుంచి ప్రజలను రక్షించడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. అయితే ఈ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలోనే 15రోజలు ముందే భారీ వర్షాలు, వరదల లాంటి వాతావరణ విపత్తులను పసిగట్టేలా కొత్త మెకానిజాన్ని రూపొందించేందుకు కేంద్ర జలవనరుల శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దీని ద్వారా ఆకస్మిక వరదల వల్ల కలిగే ప్రాణ నష్టానికి చెక్ పెట్టొచ్చని ఆలోచిస్తోంది. అంతేకాకుండా వీలైనంత వరకు ఆస్తి నష్టం జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాడనికి కూడా సమయం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కొత్త మెకానిజం రూపకల్పనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)తో కేంద్రం పనిచేస్తున్నట్లు సమాచారం.

వర్షపాతానికి వరదకు సంబంధం లేదు..

  వర్షపాతం అంచనాను బట్టి వరదను అంచనా వేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ అలా ఉండదని అధికారులు అంటున్నారు. వాస్తవానికి వర్షపాతానికి వరదకు సంబంధం ఉండదని  చెబుతున్నారు. తెలంగాణ విషయానికే వస్తే.. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడి తెలంగాణలో ఎలాంటి వానలు పడకపోయినా గోదావరి పరివాహక ప్రాంతానికి వరద ముప్పు ఉంటుందని అంటున్నారు. అయితే ఈ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడానికి అప్‌గ్రేడ్ మెకానిజం అవసరమని నొక్కి చెబుతున్నారు.

ఇటీవల కేరళలో వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెల ఢిల్లీలో వచ్చిన వరదలకు ముగ్గురు మృతి చెందారు. ఈ విపత్తులు ఈ రెండు నెలల వ్యవధిలో జరిగినవే. 2020లో వరదల కారణంగా హైదరాబాద్‌లో ఎలా అల్లాడిపో యిందో దేశం మొత్తం చూసింది. ప్రతి సంవత్సరం దేశంలోని దాదాపు మెజార్టీ రాష్ట్రాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ఉద్ధేశంతోనే ఇప్పటివరకు ఉన్న మెకానిజాన్ని అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది.

తెలంగాణలో ఆరు కేంద్రాలు..

దేశంలో వరదలను అంచనా వేసే కేంద్రాలు 340 ఉన్నాయి. ఇందులో తెలంగాణలో ఆరు వరకు ఉన్నాయి. ఇవి గోదావరి బేసిన్ లోని భద్రాచలం, కృష్ణా బేసిన్ పరిధిలో నాగార్జున సాగర్ ప్రాంతాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, ఐఎండీ హైదరాబాద్, తెలంగాణ విపత్తు ప్రతిస్పందన విభాగం, రాష్ట్ర నీటి పారుదల విభాగం కూడా వరదలను అంచనా వేసే మెకానిజాన్ని కలిగి ఉన్నాయి.

రెండో దేశం భారత్..

ప్రపంచంలో అత్యంత వరద ప్రభావిత దేశం బంగ్లాదేశ్. ఆ దేశం తర్వాత రెండోస్థానంలో భారత్ ఉంది. 2019-23 మధ్య అసియా పసిఫిక్ దేశాలకు వరదల కారణంగా దాదాపు 230 బిలియన్ డాలర్ల నష్టం జరగింది. భారత్‌లో దాదాపు 56 బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ది ఎపిడెమియాలజీ ఆఫ్ డిజాస్టర్స్ సంస్థ తెలిసింది. దేశంలో వరదల కారణంగా ఏటా సగటున 18.6 మిలియన్ హెక్టార్ల భూమి వరదలకు గురవుతోందని భారత వరద కమిషన్ నివేదిక చెబుతోంది. అయితే తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా గోదావరి పరివాక ప్రాంతాల్లో ఉన్నాయి.

 నాలుగేళ్లలో తెలంగాణలో వచ్చిన వరదలు..

  1. 2020లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు గత దశాబ్ద కాలంలో అత్యంత తీవ్రమైనవి. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో నగరం అంతా వరదలతో పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదల కారణంగా దాదాపు 50 మంది వరకు చనిపోయారు. వేలా ది మంది నిరాశ్రయులయ్యారు.
  2. 2021 సెప్టెంబర్‌లో వచ్చిన కుండపోత వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ అల్లాడిపోయింది. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
  3. 2022లో వచ్చిన గోదావరి వరద భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ప్రాంతాలను ముంచెత్తింది. అనేక ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేలాది మంది లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు.
  4. 2023 జులై వచ్చిన ఆకస్మిక వరదలు హైదరాబద్, వరంగల్ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను నీట ముంచాయి. ముఖ్యంగా వరంగల్ నగరం చెరువును తలపించింది.