calender_icon.png 11 January, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సైలు, సీఐలు ఇచ్చిన పొట్టేళ్లతో దావత్‌లు

07-09-2024 12:51:53 AM

  1. కౌశిక్, రసమయి.. సుద్దపూసల్లా మాట్లాడటం విడ్డూరం
  2. నేను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి
  3. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి 

కరీంనగర్, సెప్టెంబరు 6 (విజయక్రాంతి): ఎస్సైలు, సీఐల నుంచి పండుగలు, పబ్బాల పేరుతో పొట్టేళ్లు తెప్పించుకుని దావత్‌లు చేసుకునే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి సుద్దపూసల్లా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పోలీసుశాఖలో పోస్టింగ్‌ల పేరిట తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలను నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఐ పోస్టింగ్ కోసం తాను రూ.20 లక్షలు తీసుకున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇటీవల తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు.

వరదల సమయంలో తాను గ్రామాల్లో పర్యటించినా.. హైదరాబాద్‌కే పరిమితమైనట్లుగా రసమయి చేసిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌తో తనకు ఎలాంటి వైరం లేదని, సీపీ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో దళిత సీఐల పోస్టింగ్‌ల విషయంలో సీపీ వైఖరిని మాత్రం తప్పుపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దళిత సామాజికవర్గానికి చెందిన నలుగురు సీఐలను జాయిన్ కాకుండా సీపీ వెనక్కి పంపించారని ఆరోపించారు. ఐజీ ఉత్తర్వులు సైతం ధిక్కురించి సీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.