calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన్వాడ ఫాంహౌస్‌లో దావత్.. మధ్యలో డ్రగ్స్!

28-10-2024 02:05:50 AM

కేసు నమోదుచేసిన పోలీసులు

ఏ1-- ఫామ్ హౌస్ సూపర్‌వైజర్ కార్తీక్

ఏ2---ఫామ్‌హౌస్ యజమాని 

రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల

  1. స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల సోదాలు
  2. విదేశీ మద్యం, నిషేధిత క్రీడా సామగ్రి స్వాధీనం
  3. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఆతిథ్యం
  4. రాజ్  పాకాల మిత్రుడికి డ్రగ్స్ పాజిటివ్
  5. పరారీలో రాజ్ పాకాల.. పోలీసుల గాలింపు 
  6. రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత
  7. పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
  8. బీఆర్‌ఎస్ నేతల అరెస్టు.. డీజీపీకి కేసీఆర్ ఫోన్!
  9. సొంత ఇంట్లో కూడా పార్టీ చేసుకోవద్దా: కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో/రంగారెడ్డి, అక్టోబర్ 27 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్/శేరిలింగంపల్లి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు బావమరిది ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడిని పెం చాయి. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు అనేక నాటకీ య పరిణామాలు చోటుచేసుకొన్నాయి.

ప్రభుత్వం, పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేత లు ఆగ్రహం వ్యక్తంచేయగా, పోలీసులు మాత్రం ఆధారాలతోనే సోదాలు చేశామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఉన్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో భారీ శబ్దాలతో అర్ధరాత్రి దావత్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఘట న స్థలానికి చేరుకొని సోదాలు నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఫామ్‌హౌస్ పార్టీలో పాల్గొన్న 40 మందిని అదుపులోకి తీసుకొన్నారు. వారిలో 22 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. పోలీసులు వారి వివరాలను సేకరించారు.

తమను చూసి పార్టీలో పాల్గొన్న కొందరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తే లింది. దీంతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం, ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో పరికరాలు, ప్లాస్టిక్ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం పార్టీలో క్యాసి నో ఆడేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనుమతులు లేకుండా మద్యం పార్టీ నిర్వహించినందుకు ఏ1గా ఫామ్ హౌస్ సూపర్‌వైజర్ కార్తీక్, ఏ2గా ఫామ్‌హౌస్ యజమాని రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకా లపై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత

రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఫామ్‌హౌస్ పార్టీలో మద్యం దొరకడం, రాజ్ పాకాల పరారీలో ఉండటంతో ఆయన నివాసముండే రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ విల్లా నంబర్ 40లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ నేతృత్వంలో సో దాలు నిర్వహించడానికి సైబరాబాద్ పోలీసులతో కలిసి వెళ్లారు.

విల్లాకు తాళం వేసి ఉండ టంతో ఎక్సైజ్ సిబ్బంది కాసేపు వేచి చూశారు. సమీపంలోని ఆయన సోదరుడు శైలేంద్ర పాకాల విల్లాలో రాజ్ పాకాల ఉన్నారని సమాచారం రావడంతో అధికారులంతా అక్కడికి వె ళ్లారు. విషయం తెలుసుకొన్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విల్లా వద్దకు భారీగా చేరు కుని తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

వారెంట్ లేకుం డా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. అధికారులపై నమ్మకం లేదని, తమ న్యాయవాది సమక్షంలోనే తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తూ విల్లా వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ని నాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

దీంతో బీఆర్‌ఎస్ నేతలు మాగంటి గోపీనాథ్, వివేకానంద్, బాల్క సుమన్, శంభీపూర్ రాజు, గెల్లు శ్రీనివాస్ తదితరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు శైలేంద్ర పాకాల విల్లాలో సోదాలు నిర్వహించా రు. అందులో ౫ బాటిళ్ల విదేశీ మద్యం, ౨౦ ఖాళీ విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.

రాజ్ పాకాల నుంచే విజయ్‌కి కొకైన్! 

డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన విజయ్ మద్దూరి పోలీసుల విచారణలో పలు కీలక వి షయాలను వెల్లడించారు. రాజ్ పాకాల వద్ద నుంచే కొకైన్ తీసుకొని తాను సేవించినట్లు విజయ్ అంగీకరించి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో విజయ్ స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. అలాగే పార్టీలో పాల్గొన్న మహిళలు డ్రగ్స్ శాంపుల్స్ ఇచ్చేందుకు నిరాకరించారని పోలీసులు తెలిపారు.

కాగా రాజ్ పాకాల కంపెనీలో విజయ్ సీఈఓగా పనిచేస్తున్నారు. నూత న ఫామ్‌హౌస్‌లో దీపావళి పార్టీ కోసం రాజ్ పాకాల పిలిచాడని విజయ్ తెలిపారు. వీకెండ్‌లో తరచూ రాజ్ పాకాల పార్టీలు నిర్వహించే వారని, వీకెండ్స్‌లో రాజ్ పాకాల, విజయ్  ఇద్ద రు కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకునేవారని మోకిల పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలో నార్కోటిక్ కేసులో ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజ య్‌పై కేసు నమోదు చేశారు. రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచ్చింది? ఎవరి వద్ద నుంచి వచ్చింది? కొకైన్ ఎవరు విక్రయించారు? ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నార ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ పాకాల పరారీలో ఉండటంతో 24 గంటలు చూసి వారెంట్ జారీ చేస్తామని మోకిల పోలీసులు చెప్పారు. 

రాజ్ పాకాలపై ఎన్డీపీఎస్, గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు :  

జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీకి సంబంధించి రాజ్ పాకాలపై ఎన్డీపీఎస్, గేమింగ్ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుపై ఆదివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో రాజ్ పాకాలకు చెందిన ఫామ్‌హౌస్‌లో స్థానిక పోలీసులు, ఎస్‌ఓటీ సిబ్బంది ఎక్సైజ్ పోలీసులతో కలిసి దాడు లు నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు.

పార్టీలో 22 మంది పురుషులు, 18 మంది మహిళలు పాల్గొన్నట్లు చెప్పారు. పార్టీలో 7 విదేశీ మద్యం బాటిళ్లు, 10 లోకల్ మద్యం సీసాలు,  గేమింగ్ పరికరాలు గుర్తించామన్నారు. పార్టీలో పాల్గొ న్న పురుషులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించగా విజయ్ మద్దూరికి పాజిటివ్‌గా నిర్ధారణ అ య్యిందన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఇచ్చిన రాజ్ పాకాలపై ఎన్డీపీఎస్ యాక్టు సెక్షన్లు 25, 27, 29తోపాటు తెలంగాణ గేమింగ్ యాక్టు సె క్షన్లు 3, 4 కింద మోకిల పోలీస్‌స్టేషన్‌లో కేసు లు నమోదు చేసినట్లు వివరించారు. ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోకుండా పార్టీ నిర్వహించినందుకు ఎక్సైజ్ యాక్టు 34 ఏ, 34 (1) ఆర్‌బైడబ్ల్యూ 9 సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

డీజీపీకి కేసీఆర్ ఫోన్!

జన్వాడ ఫామ్‌హౌస్, రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లోని రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల విల్లాల్లో పోలీసులు చేపట్టిన తనిఖీలపై డీజీపీ జితేందర్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తున్నారని  డీజీపీని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని, తనిఖీలను వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. 

దీపావళి నేపథ్యంలో బంధువులకు పార్టీ ఇచ్చారు: బాల్క సుమన్

మాజీ మంత్రి కేటీఆర్‌పై బురద జల్లేందుకే ముందస్తు ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కనుసైగల్లోనే పోలీసులు సోదాలు నిర్వహించారని బీఆర్‌ఎస్ నేత బాల్కసుమన్ ఆరోపించా రు. దీపావళి పండుగను పురస్కరించుకొని రాజ్ పాకాల తన బంధువులకు పార్టీ ఇచ్చార ని, అది రేవ్ పార్టీ కాదని తెలిపారు.

మీడియా లో రేవ్ పార్టీ అని ప్రచారం చేయటం ఆపాలని కోరారు. ఓరియన్ విల్లాస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదే శాల మేరకు కేటీఆర్ ఇంటికి ఎక్సైజ్, పోలీసు లు దాడులు నిర్వహించేందుకు వచ్చినట్లు ఆరోపించారు.

సీఎం డైరెక్షన్‌లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని, కేటీఆర్‌పై ఒక ప్లాన్ ప్రకా రం కుట్రకు తెరలేపినట్లు అనుమానం వ్యక్తంచేశారు. పార్టీ జరిగింది ఫామ్‌హౌస్‌లో కాదు ఇంట్లో అని, ఇటీవల రాజ్ పాకాల గృహప్రవే శం చేశారని, ఈ సందర్భంగా అతికొద్ది మంది సన్నిహితులకు పార్టీ ఇచ్చినట్లు చెప్పారు. 

ఇంతకీ, ఎవరీ రాజ్ పాకాల?

రాజేంద్రప్రసాద్ పాకాల అలియాస్ రాజ్ పాకాల. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు చిన్నచిన్న ఈవెంట్స్ చేసుకుంటూ మధ్య తరగ తి జీవనం సాగించాడు. బీఆర్‌ఎస్ పదేళ్ల అధికార సమయంలో ఈయన చిన్నచిన్న ఈవెం ట్స్ కాస్తా వరల్డ్ వైడ్ ఈవెంట్స్‌గా మారాయి.

బీఎర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రకరకాల పేర్లతో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పార్టీ లు నిర్వహించేవారని తెలుస్తోంది. గతంలో గచ్చిబౌలిలో జరిగిన ఓ డ్రగ్ పార్టీలో సినీ నిర్మాత కేధార్ అరెస్ట్ కావడంతో, అతని వెనకాల రాజ్ పాకాల ఉన్నాడనే విషయం వార్తల్లో నిలిచింది. ప్రతిపక్ష నేతలు అప్పట్లోనే రాజ్ పాకాల చిట్టాను బయటపెట్టారు. 

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది..

ఉదయం ఎక్సైజ్ కేసు సాయంత్రం డ్రగ్స్ కేసుగా మారింది! రాజకీయంగా ఎదురుకునే దమ్ము, ధైర్యం లేక సీఎం రేవంత్‌రెడ్డి నా కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారు. కేసులు, ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించి వచ్చాం. పొంగులేటి బాంబులు పేల్చడమంటే  చివరకు కొండను తొవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు. ఫౌమ్‌హౌస్‌లో ఉన్నవారంతా మా కుటుంబ సభ్యులు, పిల్లలే.

 బీఆర్‌ఎస్ నేత కేటీఆర్