calender_icon.png 14 November, 2024 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శత వసంతాల దాశరథి

22-07-2024 12:00:00 AM

డా.నామోజు బాలాచారి :

“విజయగర్వపు వైజయంతిక గాలిలో కదలాడగా

వజ్ర సంకల్పోజ్జ్వల ధ్వజ దండమండిత హస్తులై

కరతలమ్ముల సూర్యచంద్రులు మెరయగా

చంకలో భూగోళమే ఒక బంతిగా

నడిచి వచ్చే కొత్త బిడారాలలో కలసిపోండి

వీరయోధుల్లారా, ముందుకు సాగిపోండి...  వేగమే...

దేశ రక్షకులారా, అభ్యుదయాధ్వమున పయనించుడి.”

దాశరథి కృష్ణమాచార్య రాసిన ‘నవజ గానికి వందనం’ పుస్తకంలోని చివరి పంక్తులి వి. సర్దార్ జాఫ్రీ పుస్తకానికి ఆయన చేసిన అనువాదమది. ఆయ న కలమెత్తిన వీరయోధుడు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.    

దాశరథి తెలుగు, ఉర్దూలు మాత్రమే కాదు, పార్శీ భాషకూడా ఆయనకు బాగావచ్చు. సంస్కృ తం చెప్పన క్కర్లేదు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇంకా పంచాయతీరాజ్ శాఖలో తనిఖీ అధికారిగా, ఆకాశవాణి హైదరాబాద్, మద్రాసు కేంద్రాలలో ప్రయోక్తగానూ విధులు నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన సంస్థల్లో పనిచేశారు. ‘తెలంగాణ రచయితల సంఘాన్ని’ స్థాపించి తెలంగాణ నేలపై సాహిత్య వికాసానికి కృషి చేశారు. 

నిజాం పాలనపై తిరుగుబాటుకు దాశరథి కవి త్వం ఆలంబన అయ్యింది. తెలంగాణ పోరాటాన్ని ఉర్రూతలూగించిన ఆయన్ను నిజాం ప్రభుత్వం నిజామాబాద్ ఖిజామాబాద్ జైలులో బంధించింది. ఆయనతోపాటు అక్క డ వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులు కూడా ఉన్నారు. జైలు గోడలపై బొగ్గుముక్కతో ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నుబోలిన రాజు మా కేన్నడేని/ తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ పోరాట కవితలు రాశారు. ఆయన కవితలు తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనే కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలోను ప్రజలను లక్ష్యసాధన దిశగా పురోగమించేలా ప్రోత్సహించాయి. ప్రత్యేక తెలంగాణ సాధించుకునేలా చేశాయి. 

ఉద్రేకాగ్రహాల కవిత్వమే కాదు ‘విరబూచిన మామిడిపై, స్వరమెత్తిన కోకిలలు, విరిజుంపము దాపులలో వినిపించెను కిలకిలలు’ అని ఆయన రాసిన పంక్తులు ఆయనలోని భావకవిని కూడా పరిచయం చేస్తున్నాయి. 

1977లో తెలుగు రాష్ట్రం ఆస్థానకవిగా నియమించింది. 1978లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటి నుంచి ‘ఆంధ్రకవితా సారథి’ బిరుదు పొందారు. 1987లో కళా సరస్వతి ‘ఆంధ్రరత్న’ పురస్కారం పొందారు. 

ప్రతి ఏటా దాశరథి పేరుపై ప్రసిద్ధ సాహితీవేత్తలకు ‘దాశరథి అవార్డు’ ఇస్తూ ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. శత జయంతి వేడుకల సందర్భంగా వివిధ విద్యాసంస్థలలో ‘దాశరథి సాహిత్యంపై సమాలోచన’ పేరిట భావి భారత యువ సాహితీవేత్తలకు మార్గ నిర్దేశనం చేసే కార్యక్రమం ‘తెలంగాణ సాహిత్య అకాడమి’ చేపట్టింది. దాశరథి వేడుకలలో మరిన్ని సాహిత్య కార్యక్రమాలను నిర్వహించ పూనుకుంటున్నది.  అందులో భాగంగా శతాధిక కవులతో కవి సమ్మేళనం ఏర్పాటుకు కృషి జరుగుతున్నది. 

‘ప్రత్యేక సంచిక’, ‘సాహిత్య సమాలోచన’, ‘సంగీత విభావరి’ పలు విధాలుగా మహాకవి దాశరథి శత జ యంతి వేళ ‘తెలంగాణ సాహి త్య అకాడమి’ నివాళులు అర్పిస్తున్నది. 

వ్యాసకర్త: కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి

సెల్:9063131999