హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డును (2024) ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు రూ. 101,116 నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు. జగన్నాథం స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి. 1955లో ఆయన జూకంటి సుశీల, దుర్గయ్య దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభాసం అంతా సిరిసిల్లలోనే కొనసాగింది. పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్‌కామ్, ఊరుకు నారుమడి, సద్దిముల్లె వంటి 16 గ్రంథాలను ఆయన రాశారు.
వచన కవిత్వం ఆయన శైలి. అభ్యుదయ, దళిత, బహుజన, మైనార్టీవాదాలే ఆయన కవితా వస్తువులు. ప్రపంచీకరణ పరిణామాలను తెలుగు సాహిత్యంలో ప్రతిబింబించిన తొలి కవిగా ఆయనకు పేరున్నది. ఆయన గ్రంథాలు కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి కూడా అనువదించారు. ఆయనకు ఇప్పటికే సినారే కవితా పురస్కారం, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథా పురస్కారం, తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం, తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం వంటి అనేక అవార్డులు లభించాయి. జగన్నాథంకు అవార్డు రావడం పట్ల అనేక మంది కవులు హర్షం వ్యక్తం చేశారు.