calender_icon.png 24 October, 2024 | 5:57 AM

మానవీయ సమాజాన్ని స్వప్నించిన దాశరథి

22-07-2024 02:57:53 AM

ప్రజా కవి గోరటి వెంకన్న

నిజామాబాద్‌లో ఘనంగా దాశరథి జయంతి 

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఏ మత గ్రంథాల్లోనూ లేని మానవత విషయాలను కవితల రూపంలో చెప్పిన మహాకవి దాశరథి అని, ఎవరు స్పృశించని విషయాలను దాశరథి కవితగా మార్చాలని ప్రజా కవి గోరటి వెంకన్న అన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన దాశరథి 99వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రశ్న వేయకుంటే కవి కవి కాడు.. ప్రశ్న వేసినవాడే నిజమైన కవి అని వెంకన్న అన్నారు. పద్యాన్ని చాలా గొప్పగా రాసిన కవి దాశరథి అని, ఆయనో అద్భుతమైన భావకవి అని తెలిపారు.

వ్యవహారిక సత్యాన్ని తన రచనల రూపంలో చెప్పిన మహాకవి దాశరథి అని గోరటి కొనియాడారు. మానవీయ సమాజాన్ని స్వప్నించి రచనలు చేసిన దాశరథి అందరికీ ఆదర్శనీయుడని, కవుల నుంచి పసిపాప నవ్వులాంటి కవిత్వం రావాలి, కవి శ్రమజీవుల పక్షాన ఉండాలి అని అన్నారు. మనుషుల్లో వివేకం నశించి క్రూరత్వం పెరుగుతోందని, ఇది సమాజానికి మంచిది కాదని చెప్పారు. వివేకవంతులు సైతం ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కొందరు లాభాపేక్షతో అన్నీ కల్తీ చేస్తున్నారని.. కవులు, రచయితలు ప్రజల కోసం పది నిమిషాలు కేటాయించి వారి కష్టాలను రాస్తే దాశరథికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.