కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా దాసరి వేణు జిల్లాకు అందించిన సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేసిన దాసరి వేణు బదిలీపై వెళుతున్నందున మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అదనపు కలెక్టర్ గా దాసరి వేణు జిల్లాకు అందించిన సేవలు అభినందనీయమని, జిల్లాలో 16 నెలల పాటు పనిచేశారని తెలిపారు.
గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజలు, అధికారులతో మమేకమై వారితో మర్యాదగా వ్యవహరిస్తూ అందరికీ చేరువలో సేవలు అందించారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు మాట్లాడుతూ తాను జిల్లాలో నిర్వహించిన విధులలో అధికారులు, కార్యాలయాల సిబ్బంది అందించిన సహకారం మరువలేని అన్నారు. అనంతరం దాసరి వేణును శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.