calender_icon.png 6 April, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఎలు, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలి

05-04-2025 10:42:42 PM

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్..

కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో టి పి టి ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు వాయిదాల డిఎను, జులై 2023 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని, అవి కావాలంటే నెలనెలా జీతాలే ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను, వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని టి పి టి ఎఫ్ స్పష్టం చేస్తుందన్నారు. కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు సమయమిచ్చామని, ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, నూతన పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది.  ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో, ప్రజల్లోనూ భాగంగా ఉన్నారు.

వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఐదు నెలల క్రితం ఉద్యోగ సంఘాల జెఎసి ప్రతినిధులతో జరిపిన సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం చేస్తామని, ఈ లోగా ఆర్థిక భారం లేని సమస్యలను శాఖలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు ఏ శాఖ ప్రతినిధులతోనూ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగలేదన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అనే తేడా లేకుండా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టి పి టి ఎఫ్ ఆరోపించింది. ఈ ధోరణి ప్రభుత్వానికి మంచిది కాదని, సాధారణ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి తీవ్రమై పోరాటానికి దారితీసే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ TPTF డిమాడ్ చేసింది.

ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే డబ్బులు ఇప్పటివరకు ఇవ్వకపోవడం మరియు 2023 పదవ తరగతి మూల్యాంకన డబ్బులు కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడం శోషనీయం వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నలినీ దేవి జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మి నరేందర్ ప్రకాష్ గోప్ శ్రీనివాస్ నారాయణ సునీల్ తదితరులు పాల్గొన్నారు.