‘నా చిన్నతనం అంత సింగరేణి ప్రాంతంలో గడిచింది. ఒక విధంగా అది బొగ్గుగని ప్రాంతం కావడం మూలంగా.. అక్కడి నలుపు, తెలుపు రంగుల ప్రభావం నాపై ఎక్కువగా పడ్డది. ఆ రెండు రంగుల ప్రభావం నాలో తెలియని మానసిక సంఘర్షణకు గురి చేశాయి’ అంటున్నారు ఆర్టిస్టు బావండ్లపెల్లి రాజ్‌కుమార్. తాను చూసిన పరిసరాలను.. దృశ్యాలను చూపరుల మనసుకు హత్తుకునేలా గీయగలరు రాజ్‌కుమార్. ఒక ఆర్టిస్టుగా తన డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ద్వారా లోతైన భావాల్ని వ్యక్తపరుస్తారు. విజయక్రాంతితో రాజ్‌కుమార్ ముచ్చట ఇది..
మాది మంచిర్యాల జిల్లా.. శ్రీరాంపూర్ కాలనీ.. సింగరేణి కోల్‌మైన్స్ ఏరియా. మా నాన్న సింగరేణి కోల్‌మైన్స్‌లో పని చేసి రిటైర్ అయ్యారు. మేం నలుగురం అబ్బాయిలం. నేను రెండో వాణ్ని. అన్న.. ఇద్దరు తమ్ముళ్లు మంచిర్యాల్లో అమ్మదగ్గరే ఉంటారు. స్కూల్లో చదువుతున్న సమయంలో మా పెద్దనాన్న కొడుకు(అన్నయ్య) ఎలక్షన్స్ సమయంలో వాల్ రైటింగ్ రాస్తుండేది.
అలా వాల్ రైటింగ్ రాసేటప్పుడు.. దాన్ని చాలా ఆసక్తిగా చూసేవాణ్ని. ఒక విధం గా అక్కడే ఆర్ట్ మీద ప్రేమ పుట్టింది. ఇంటర్‌లో హోర్డిం గ్స్, వాల్ రైటింగ్స్ మీద బాగా వర్క్ చేశా. ఇంటర్ అయిపోయాక ఒక అన్న ద్వారా హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ అనే కోర్సు ఉంటుందని చెప్పడంతో.. ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు అప్లు చేసి.. ఎంట్రెన్స్ రాస్తే జేఎన్‌టీయూలో సీటు వచ్చింది. అక్కడి నుంచే ఆర్టిస్టుగా నా జర్నీ మొదలైంది. ఒక ఆర్టిస్టుగా ‘చీమలదండు’ డ్రాయింగ్‌కు జాతీ య స్థాయిలో ఉత్తమ ఆర్టిస్టు అవార్డు అందుకున్నా. అది ఎప్పటికీ మరిచిపోలేను.
ఈ ఆర్ట్స్ ప్రత్యేకత ఏంటి?
ఒక్కసారి మనం ఆదిమకాలంలోకి వెళ్తే.. మనిషికి.. మనిషికి భాష అనేది రాకముందు. ఒకరి నుంచి మరొకరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆదిమానవులు ఉపయోగించిన పద్ధతిని ‘హ్యాష్‌ట్యాగ్ ప్యాట్రా’ అంటా రు. ఇది ఒకరకమైన డ్రాయింగ్(చిత్రకళ). ఆదిమానవు లు డ్రాయింగ్ ద్వారా ఒకరి నుంచి మరొకరు కమ్యూనికేట్ చేసుకునేది. దాన్ని ఆదర్శంగా తీసుకొని నాకు నచ్చిన.. నేను చూసిన వాటిని పరిశీలించి.. ఈజీగా.. తొందరగా కనెక్టు అయ్యే వాటిపై వర్క్ చేస్తున్నా.
ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జిబిషన్స్ నిర్వహించారు?
బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శన లు ఇచ్చా. హైదరాబాద్ కల్చర్ మీద చాలా డ్రాయింగ్స్ వేశా. నా డ్రాయింగ్స్ నచ్చడంతో అప్పటి అధికారులు తెలంగాణ కల్చర్ థీమ్ మీద కొన్ని డ్రాయింగ్స్ కావాలని అడిగారు. అలా నేను వేసిన డ్రాయింగ్స్, పెయిం టింగ్స్‌ను తెలంగాణ సచివాలయంలో కనిపిస్తాయి.
మీ డ్రాయింగ్‌లో ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ స్కెచ్‌లే కనిపిస్తాయి? కారణం ఏమైనా ఉందా?
బ్లాక్ అండ్ వైట్ అనేది వర్క్ యూనిఫాంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అనుకున్న సోల్ ఏదైతే ఉందో అది పర్‌ఫెక్టుగా కనిపిస్తుంది. కలర్ అనేది మన దృష్టి కోణాన్ని ఆకర్షిస్తుంది. ఉదాహరణకు మనకు ఇష్టమైన రంగు వైపే మనం చూస్తాం. మీగత రంగులను చూడకపోవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా కలర్స్ మన దృష్టి కోణాన్ని మనకు ఇష్టమైన రంగుల వైపు మళ్లీస్తాయి.
అయితే బ్లాక్ అండ్ వైట్ రంగుల దగ్గరకు వచ్చేసరికి ఏమౌతుందంటే.. మొత్తం యూనిఫాం గా ఒక్కటే టోన్‌తో మోనోక్రోమ్‌గా కనిపిస్తుంది. దానివల్ల ఒక సంపూర్ణమైన చిత్రకళను చూపించొచ్చు. డ్రాయింగ్ థీమ్ ఎక్కడ దెబ్బతినదు. బ్లాక్ అండ్ వైట్ అనేది యూనివర్సల్ కలర్స్. ఈ కలర్స్ ద్వారా అనుకు న్న డ్రాయింగ్‌ను ఈజీగా వేయగలను. చెప్పదల్చుకున్న అంశానికి పూర్తిగా న్యాయం చేయగలనే నమ్మకం.
కళల మీద మీ అభిప్రాయం?
ప్రతి మనిషికి కళలు అనేవి చాలా అవసరం. ఎందుకంటే? మనం ఎంత సంపాదించాం? అనేది పక్కన పెడితే. ఈ కళలు అనేవి మనల్ని మానసికంగా చాలా సంతోషంగా, దృఢంగా ఉంచుతాయి. ఆర్టిస్టులకు ముఖ్యంగా కళ ద్వారానే ఆనందం. ఇలాంటి ఆనందం మరెక్కడ దొరకదు.
అది ఇదే ఫీల్డ్ అని కాదు.. పాటలు, సంగీతం, డ్యాన్స్ ఇలా భిన్న కళలు ఉన్నాయి. వాటిలో ఏమైనా కావొచ్చు. వీటి ద్వారా వచ్చే సంతోషం చాలా సంతృప్తిగా ఉంటుంది. కళలు అనేవి మానసిక సంఘర్షణను వ్యక్తపరచడానికి ఒక వేదిక వంటివి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది ఒక కళ ద్వారానే సాధ్యం అవుతుంది.
కళకారులకు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సహం లభిస్తుందా?
ప్రభుత్వం నుంచి కళకారులకు ప్రోత్సహం అంటూ ఏమి లేదు. ప్రతి ఏడాది ఆర్ట్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ గురుకులలో డ్రాయింగ్ టీచర్ పోస్టులు కొత్తగా ప్రవేశపెట్టింది. అది కేవలం గురుకులలో మాత్రంమే కాకుండా ప్రాథమిక, హైస్కూల్ స్థాయిలో కూడా ఈ పోస్టులను పెడితే బాగుంటుంది.
మరో విషయం ఏమిటంటే.. ఆర్ట్‌కు సం బంధించిన కోర్సులు చేసినవాళ్లకు ఎక్కువ అవకాశం ఇస్తే.. ఆర్ట్స్‌ను ఎక్కువ క్వాలిటీగా భోదించగలుగుతారు. అంటే 45 రోజుల సర్టిఫికెట్ కోర్సుల్లా కాకుండా ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేసినవాళ్లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఇక ‘లలిత కళ అకాడమీ’ ద్వారా స్థానిక కళకారులకు మంచి జరుగుతుంది. ఆర్టిస్టులకు అదొక వేదిక.
ప్రభుత్వానికి ఒక చిన్న సలహా?
ఫైన్ ఆర్ట్స్ కోర్సులు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. అయితే దాని గురించి అవగాహన లేకపోవడం బాధకరం. ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఎక్కువ మందికి తెలిసే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఫైన్‌ఆర్ట్స్‌లో చాలా విభాగాలు ఉంటాయి. వాటికి సంబంధించిన విభాగాల్లో తగిన శిక్షణ అందిస్తే.. మంచి కళకారులు మన దగ్గర తయారవుతారు.
మనం చూస్తున్నాం.. ఇప్పుడు మెడిసిన్, ఐఐటీ, జేఈఈ.. ఇవి మాత్రమే చదువులని మన పిల్లలపై రుద్దుతున్నాం. ఇదీ సరైనది కాద ని నా అభిప్రాయం. వీటితో పాటు ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ఆనందాన్ని కలిగించే కోర్సులు కూడా ఉన్నాయి.
డ్రాయింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్, సంగీతం, ఇంటీరియల్ డిజైనింగ్స్ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు సృజనాత్మకతకు సంబంధించినవి. తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే.. పిల్లలు ఏ రంగాన్ని ఇష్టపడితే దాంట్లోనే ప్రోత్సహించండి. అప్పుడే వాళ్లు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
- రూప