సిరియాలో అంతర్యుద్ధం ఊహించినదానికన్నా తక్కువ రక్తపాతం తో ముగిసింది. దేశ రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటుదారు లు హస్తగతం చేసుకోవడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటుగా దేశం వదిలిపెట్టి పారిపోయారు. ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇచ్చినట్లు రష్యా ప్రకటించింది కూడా. అంతేకాకుండా అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చించిన తర్వాతే అసద్ సిరి యా వీడినట్లు కూడా ప్రకటించింది. అసద్ వెళ్లిపోయిన తర్వాత అధ్యక్ష భవనంలోకి పౌరులు చొరబడి ఫర్నిచర్, ఇతర ఖరీదయిన వస్తువులను దోచుకెళ్తున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో కనిపించాయి.
సిరియాలో అసద్ పాలన అంతమయినందుకు ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతర్యుద్ధం కారణంగా దేశం వదిలి వెళ్లిన వారంతా తిరిగి రావా లని తిరుగుబాటుదారులు పిలుపునివ్వడంతో చాలా మంది స్వదేశానికి పయనమయ్యారు కూడా. వారం, పది రోజుల క్రితం తిరుగుబాటుదారు లు తమ స్థావరమైన ఇద్లిబ్‌నుంచి దేశంలో రెండో పెద్ద నగరమైన అలె ప్పో దిశగా పయనమయినప్పుడు అసద్ అధికారం కోల్పోతారని, రెండువారాల్లోనే డమాస్కస్ వారి హస్తగతమవుతుందని ఎవరూ ఊహించ లేదు. దీంతో దాదాపు రెండున్నర దశాబ్దాల అసద్ కుటుంబ పాలన అంతమయింది.
అసద్ నిష్క్రమణతో మెజారిటీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నప్పటికీ, సిరియా భవిష్యత్తుపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతు న్నాయి. ఎందుకంటే భౌగోళికంగా సిరియా కీలకప్రాంతంలో ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా అది పొరుగుదేశాలనే కాదు, ప్రపంచాన్నీ ప్రభావి తం చేస్తుంది. 2011నుంచి 13 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధమే దీనికి నిదర్శనం. అమెరికా, రష్యా, ఇరాన్ టర్కీ ..ఇలా పలు దేశాల ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఈ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే అసద్ గద్దె దిగడంతోనే అంతా మారిపోతుందనుకోవడం అత్యాశే.
తిరుగుబాటులో అబూ మహ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హయాత్ తహరీర్ అల్‌షామ్(హెచ్‌టీఎస్) కీలక పాత్ర పోషించింది. దీని గత చరిత్రేమీ గొప్పగా లేదు. ఒకప్పుడు అల్‌ఖైదాతో సంబంధాలున్న ఈ సంస్థ గతంలో తాము ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాలనే అమలు చేసింది. అంతేకాదు అమెరికా సహా అనేక దేశాలు హెచ్‌టీఎస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. మరోవైపు సిరియాలో అనేక గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ రానున్న రోజుల్లో ఒకే తాటిపైకి వస్తేనే సిరియాలో శాంతి. లేకుంటే మళ్లీ రక్తపాతమే జరిగే అకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా.
టర్కీ సరిహద్దుల్లోని కుర్దు మిలిటెంట్ల సమస్య కూడా రానున్న రోజుల్లో సిరియా ప్రశాంతతను తేల్చనుంది. మరోవైపు ఐసిస్‌నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. ఇలా సిరియాలోని ప్రాంతాలను అనేక గ్రూ పులు పంచుకున్నాయి. వీరందరినీ ఏకతాటిపైకి తేవడమే పాలనా పగ్గాలు చేపట్టే వారికి అతిపెద్ద సవాలు. మరోవైపు సిరియాలో తాజా పరిణామాలపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం అత్య వసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అసద్ పాలన అంతమవడం ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిరియా ప్రజలకు లభించిన చారిత్రక అవకాశంగా అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు వచ్చే నెల అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ మాత్రం సిరియా పరిణామాలతో అమెరికాకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ కూడా అసద్ పాలన కూలిపోవడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది.
సిరియాలోని ఇరాన్, హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో వందలాది వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక్కసారిగా చోటు చేసుకున్న సిరియా పరిణామం భారత్‌కు పరీ క్షా సమయంగా మారింది. ఎందుకంటే అసద్ చాలాకాలంగా భారత్‌కు నమ్మకమైన మిత్రుడు. రాబోయే రోజుల్లో సిరియా పరిణామాలు ఆ దేశం లో మన సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.