త్రయో భియోక్తారః
ధర్మలోభో సురవిజయిన ఇతి..
- కౌటిలీయం- -(12.-1)
“అభియోక్తలు అంటే ప్రత్యర్థులు. వారు ధర్మవిజయి, లోభవిజయి, అసుర విజయి అని మూడు విధాలుగా ఉంటారని” ఆచార్య చాణక్య చెపుతున్నారు. “ధర్మవిజయి ‘నేను నీ వాడను’ అంటూ లొంగిపోతే పొంగి పోతాడు. ధర్మవిజయిని ఆశ్రయిస్తే ఇతరుల వల్ల కలిగే భయాన్నీ తొలగిస్తాడు. లోభవిజయి భూమిని, సంపదను హరించి సంతోషిస్తాడు. అలాంటి వారికి ధనం ఇచ్చి అనుకూలురుగా చేసుకోవాలి.
అసుర విజయి.. భూమిని, సంపదనే కాకుండా భార్యాపిల్లలను కూడా హతమార్చి ఆనందిస్తాడు. అలాంటి వారికి రాజ్యాన్ని, సంపదను అప్పగించి భార్యాపిల్లలతో పారిపోయి సమయం అనుకూలించిన వేళ ప్రతిక్రియను చేయాలి” అంటాడు చాణక్య.
ప్రస్తుత వ్యాపార రంగానికి దీనిని అన్వయించుకుంటే.. ప్రత్యర్థి సంస్థలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కుదురుతుంది. వ్యాపార రంగంలో నిరంతరం పోటీ ఉంటుంది. ఎంతటి ఉన్నతమైన, నాణ్యమైన ఉత్పత్తిని అందించినా వినియోగదారుని అవసరాలు, అంచనాలు ఇంకా హెచ్చుగానే ఉంటాయి. సమకాలీన సాంకేతిక పరిజ్ఞానం ఎంత అధునాతనమైనదైనా సార్వకాలికం కాజాలదు. ప్రతి అత్యుత్తమమైన దానిని అధిగమించేందుకు మరొకటి ఎదురుచూస్తూ ఉంటుంది. వినియోగదారుని ఆకర్షించేందుకు ప్రత్యర్థి సంస్థలు పలు విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాయి.
అధునాతన సాంకేతిక విజ్ఞానంతో ఒక సంస్థను నెలకొల్పినా నిరంతరం మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని మరొక సంస్థ వెలుగు చూడవచ్చు. తక్కువ ధరలో ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను అందించవచ్చు. దానిని తట్టుకొని నిలవాలంటే సంస్థలు ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులను, అవసరాలను తెలుసుకోవడం, విపణి వీధిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడం, పరిశోధన అభివృద్ధి విభాగాలను ఆధునీకరించుకోవడం అవసరం. అదనంగా ప్రత్యర్థుల దాడులను త్రిప్పికొట్టే వ్యూహాలనూ ఆలోచించాలి.
సృజనాత్మక పోటీ ఉండాలి
ఈ క్రమంలోనే ప్రత్యర్థులు ‘సృజనశీలురు, నిర్వాహకులు, ఫలితాపేక్షులు’ అని మూడు రకాలుగా విభజించుకోవచ్చు. సృజనశీలురు నిరంతరం కొత్తదనాన్ని అన్వేషిస్తూ, ఆదరిస్తూ పరిశ్రమలో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరు తమ అనుభవానికి సృజనశీలతను జోడిస్తూ, పోటీదారుల మధ్య ఆరోగ్యకరమైన స్పర్ధకు ప్రేరణను ఇస్తారు. పరిశ్రమలో రేపటి అవసరాలపై దృష్టి పెట్టడమే కాకుండా వినియోగదారుల అవసరాలు, వారి సంతృప్తిని పరిగణనలోకి తీసుకొని సాంకేతిక విప్లవాలకు నాంది పలుకుతారు.
‘నీవు గెలువు/ నన్ను గెలవనీయి’ అంటూ తమతో కలిసి వచ్చే పోటీదారుల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తారు. నిజాయితీ గలిగిన ప్రత్యర్థులకు అవసరమైన వేళ పరస్పర సహకారం ప్రాతిపదికగా సాంకేతిక విజ్ఞానాన్ని అందించేందుకూ వెనుకాడరు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ.. వినియోగదారులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటారు. శక్తి కలవడంలో ఉంటుందే కాని విడిపోవడంలో ఉండదనేది వీరి సిద్ధాంతం. వీరిని ధర్మ విజయులు అనవచ్చు. వీరిని వ్యాపారస్థులనే కన్నా పారిశ్రామిక వేత్తలుగా చెప్పడం సమంజసం.
నిర్వాహకులకు తమ వ్యాపారం, లాభాలు మాత్రమే ముఖ్యం. సామ దాన భేద దండోపాయాలతో పోటీదారులను మార్కెట్ నుంచి వీలై నంతగా తప్పించి, ఏకఛ్ఛత్రాధిపత్యానికై ప్రయత్నించడం వీరి లక్షణం. ప్రక్రియకన్నా ఫలితాలపై ఎక్కువ దృష్టి నిలుపుతారు. వీరి కార్యకలాపాలు న్యాయబద్ధంగా కాకుండా చట్టబద్ధంగా మాత్రమే ఉంటాయి. తమ స్వార్థ ప్రయోజనాలకై ఇతరులకు సహకారం అందించినట్లు కనిపిస్తారే కాని, ఏ మాత్రం అవకాశం వచ్చినా ప్రత్యర్థుల వ్యాపారాన్ని భగ్నం చేసేందుకు వెనుకాడరు.
పోటీదారుల వద్ద పని చేసే నైపుణ్యం గలిగిన ఉద్యోగులనేకాక వారి వినియోగదారులనూ ప్రలోభాలకు గురి చేస్తూ, ఆకర్షణలతో ప్రత్యర్థుల వ్యాపారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకూ తెగబడతారు. అయితే, వీరికి వ్యాపారాలే కాని వ్యక్తులు శత్రువులు కారు. వీరిని లోభవిజయులుగా చెప్పుకోవచ్చు.
ఇక, ఫలితాపేక్షులు తమ వ్యాపార విస్తరణకై ఎన్ని అపమార్గాలనైనా అనుసరిస్తారు. ధర్మం, న్యాయాలపై ఏ మాత్రం గౌరవం చూపరు. వీరు చట్టాన్ని అతిక్రమించేందుకూ వెనుకాడరు. ఏ మార్గంలోనైనా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే వైఖరి వీరిది. ప్రత్యర్థుల వ్యాపారాలనే కాక వారిని వ్యక్తిగతంగానూ త్రొక్కి వేసేందుకు ఏ మాత్రం వెనుదీయరు. ప్రక్రియపైకన్నా కుట్రలు కుతంత్రాలతో మార్కెట్‌పై ఆధిపత్యాన్ని సాధించే వీరిని అసురీ విజయులుగా చెప్పుకోవచ్చు. వీరితో సంబంధాలు ప్రమాదకరమైనవి.
చిన్న పరిశ్రమల వారు తమ వ్యాపార విస్తరణకై ధర్మవిజయులను ఆశ్రయించడం ఉత్తమం. బలం బలాన్ని గౌరవిస్తుంది. అహంభావానికన్నా విజయ సాధన ఉత్తమం. ధర్మవిజయుల ఆశ్రయంలో బలోపేతులుగా మారడం వల్ల మిగతా వారినుంచి రక్షణను పొందవచ్చు. స్వార్థపరులైన లోభవిజయులను అవసరానుగుణంగా మాత్రమే వాడుకోవాలి. కొంత మార్కెట్ చేజారినా వారిని దగ్గరకు రానీయడం ప్రమాదకరం. అసురీవిజయుల వల్ల నష్టం అధికంగా ఉంటుంది.
తాము నష్టపోయినా, ప్రత్యర్థులనే కాకుండా మార్కెట్‌నూ అంతం చేసే వీరిని మిగతా వారి సహకారంతో ఎదుర్కోవడం ఉత్తమం. అత్యంత ప్రమాదకరమైన వీరిని ఏ విధంగానూ దరిచేరనీయక పోవడం ఉత్తమోత్తమం. అంతిమ విజయ సాధనలో కొన్ని అపజయాలను ఆహ్వానించడమూ సమంజసమే.