26-04-2025 08:21:12 PM
మద్నూర్ (విజయక్రాంతి): మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ శివారులో ఓ రైతు తన పొలంలో ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ వంగిపోయి, దానికి సంబంధించిన వైర్లు కిందకి వచ్చి వేలాడుతున్నాయి. ఈ కారణంగా రైతు భయంతో పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు, విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ, వారు ఇప్పటివరకు ఎటువంటి స్పందన చూపకపోవడం వల్ల సమస్య కొనసాగుతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
వైర్లు పొలం మీదకు తక్కువ ఎత్తులో ఉండటంతో పంటలు నష్టపోయే అవకాశం ఉందని, గిట్టుబాటు లేకుండా పోతుందని రైతు వాపోయారు. పైగా ఈ తడిపోత వలన మానవ జీవితాలకు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. రైతు చేసిన విజ్ఞప్తిని పట్టించుకొని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పోల్ ను సరిచేసి, వైర్లను సురక్షితంగా అమర్చాలని కోరుతున్నారు. ప్రజలు ప్రాణ భద్రతకే ముప్పు ఏర్పడేలా అవకాశం ఉన్న ఈ విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించాలని రైతు కోరుతున్నాడు.