calender_icon.png 26 October, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమల్లో ప్రమాదం.. కార్మికులకు ప్రాణగండం

05-08-2024 01:42:35 AM

  1. శ్రామికుల భద్రతపై యాజమాన్యాలకు పట్టింపు శూన్యం 
  2. సంగారెడ్డి జిల్లాలోని ఇండస్ట్రీల్లో రక్షణ చర్యలు నిల్
  3. నిర్వహణ లోపంతో తరచూ ప్రమాదాలు 
  4. కార్మికుల ప్రాణాలు బలి.. కొందరికి శారీరక వైకల్యం

సంగారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట, ఏదో ఒక పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తోంది. బతకుదెరువుకు వలసొచ్చిన కూలీల జీవితాలు కూలుతున్నాయి. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం.. కారణం ఏదైనా వాటి పర్యావసనాలు అనుభవించేది మాత్రం కష్టజీవులేనని వరుసగా జరుగుతున్న ప్రమాదాలను చూస్తే తెలుస్తుంది.

పటాన్ చెరు, ఎద్దుమైలారం, హత్నూర, జిన్నారం ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో ఇటీవల ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శారీరక వైకల్యాన్ని పొందారు. జిల్లాలోని హత్నూర, పటాన్‌చెరు, జిన్నారం, బొల్లారం, గుమ్మడదల, పాశమైలారం పారిశ్రమిక వాడల్లోని వందలాది పరిశ్రమలపై అధికారులు నిఘా ఉంచకపోవడంపై ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

అవగాహన కార్యక్రమాలేవీ?

జిల్లాలోని పరిశ్రమల్లో తెలంగాణకు చెందిన కార్మికులే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కూలీలు పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో తరచూ కొత్తగా ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, ఒప్పంద కార్మికులు చేరుతుంటారు. కొందరు అక్కడి నుంచి మరో పరిశ్రమకు వెళ్తుంటారు. ప్రమాదాల నివారణపై యాజమాన్యాలు దృష్టిసారించకపో వడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

కార్మికులకు సరైన నిపుణులతో రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. కొన్ని యాజమా న్యాలు కార్మికులకు భద్రత కోసం కనీసం దుస్తులు, హెల్మెట్, మాస్కులు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫలితంతా కూలీలు ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పనిచేయాల్సిన అగత్యం ఏర్పడింది.

నిఘా.. పర్యవేక్షణ ఏది?

ఏటా వేసవికి ముందు చిన్న, మధ్య, భారీ పరిశ్రమలను తనిఖీ చేసి అగ్నిమాపక శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. జిల్లాలోని ఎన్నో పరిశ్రమలు అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా కోనసాగుతున్నాయని తెలిసింది. పటాన్‌చెరులోని అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

పాటించాల్సిన జాగ్రత్తలు..

పరిశ్రమల్లో రియాక్టర్లు, బాయిలర్లు, పొగ గొట్టాలతో పాటు ఇతర యంత్రాల నిర్వహణ పక్కాగా ఉండాలి. పరిశ్రమల్లో నీటిని వెదజల్లే వ్యవస్థ, సెల్ఫ్ కంటైనింగ్ , బ్రీతింగ్ ఆపరేటర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగిన వెంటనే సత్వరం స్పందించేందుకు రెస్క్యూ బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచాలి. ప్రతి విభాగానికి ఒక పర్యవేక్షక నిపుణుడిని నియమించాలి. ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే అధికారులు పరిశ్రమలు తనిఖీ చేయకుండా, నిబంధనల ప్రకారం తరచూ తనిఖీలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.