calender_icon.png 5 December, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌లో భారీ ప్రవాహంతోనే ప్రమాదం

09-08-2024 12:35:43 AM

  1. కాంట్రాక్టు సంస్థదే నిర్మాణ బాధ్యత
  2. జలమండలి ప్రకటన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు ౮ (విజయక్రాంతి): నాగార్జునసాగర్‌లో భారీ ప్రవా హం రావడం, టన్నెల్ వద్ద ఒత్తిడి పెరగడంతోనే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ రిటైనింగ్ వాల్ కూలిపోయిందని జలమండలి అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదం ఈ నెల 2న ఉదయం  జరిగిందని,  ఆ సమయంలో అక్కడ ఎవరూలేరని చెప్పారు.  ఈ ఘటనతో రిజర్వాయర్ సంపు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండిపోయినట్టు వెల్లడించారు. కాగా, టన్నెల్ నీటి లెవల్ తగ్గాక దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని మెఘా ఇంజనీరింగ్ సంస్థే పునర్నిర్మిస్తుందని, అందుకోసం అయ్యే ఖర్చు రూ.20 కోట్లను ఆ సంస్థే భరిస్తుందని స్పష్టంచేశారు. ఇన్‌టేక్ వెల్ లోపల నిర్మించిన మొత్తం గోడల పొడవు సుమారు 1020 మీటర్లు కాగా అందులో ప్రస్తుతం సుమారు 50 మీటర్ల గోడ  కూలినట్టు చెప్పారు. ఈ పనులు 2022లో ప్రారంభమై 2023లో పూర్తునట్లు చెప్పారు. 

ముగ్గురితో విచారణ కమిటీ ఏర్పాటు

ఇన్‌టేక్ వెల్ గోడ కూలిన ఘటనపై జలమండలి ఉన్నత ఇంజినీర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఈ ఘటన వల్ల మార్చిలోగా పూర్తి చేయాల్సిన పనులు మరో 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకం ఉండబోదని, ప్రస్తుత సరఫరా వచ్చే ఏడాది వరకు యథావిధిగా కొనసాగుతుందని అధికారుల స్పష్టంచేశారు.