‘నాట్యం అనేది నా దృష్టిలో ప్యాషన్, ప్రొఫెషన్ మాత్రమే కాదు. ఒక తపస్సు లాంటిది. నాట్యం ద్వారా మనస్సు, శరీరం, ఆలోచనలు అన్నింటినీ ఏకాగ్రతగా చేస్తే మోక్షం వస్తుంది అని నా భావన’ అంటున్నారు డాక్టర్ కళా హంస కృష్ణ సాహితీ. చిన్నతనం నుంచి నాట్యమే ఒక తపస్సు భావించి.. వేదంపై, శ్రీ సూక్తంపై యూనిక్ కొరియోగ్రఫీ చేస్తూ ముందుకెళ్తున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి స్వరూపాలను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అచ్చం అమ్మవారి అలంకరణతో భంగిమలు వేస్తూ ఆదిశక్తిని విశ్వవాప్తం చేస్తున్నారు. అంతేకాదు శ్రీ సూక్తం.. దక్షాయణి ముద్రలు వేసి వాటి అర్థాన్ని వివరించిన మొట్టమొదటి మహిళ డాక్టర్ కళా హంస కృష్ణ సాహితీ కావడం విశేషం. శ్రీ శక్తిని మోటోగా పెట్టుకొని ముందుకెళ్తున్నా ఆమె జర్నీ ఆమె మాటాల్లోనే.
నా జన్మస్థలం ఖమ్మం అయినా.. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఏడేళ్ల వయసులో కూచిపూడి, సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. చిన్నప్పట్నించి మా కుటుంబం మొత్తం ఆర్ట్స్‌లోనే ఉంది. మా తాతయ్య ముళ్లపాటి రామేశ్వరావు. అతను చాలా పెద్ద వయొలినిస్టు. ఆల్ ఇండియా రెడియో ఆర్టిస్టు కూడా. మా నాన్న కవి సవ్యసాచి. ఆయన బ్యాంకు మెనేజర్. అలాగే ఒక మంచి రచయిత, ఆర్టిస్టు కూడా. ఇలా.. మా ఫ్యామిలీలో ఆర్టిస్టులు ఉన్నారు. దాంతో చిన్నతనం నుంచే డ్యాన్స్, సంగీతం నేర్చుకున్నా.
మొదట కర్నాటక మ్యూజిషియన్ అవ్వాలి అనుకున్నాను. కానీ నెమ్మదిగా నాట్యం వైపే నా ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. నాట్యంలో కొత్తగా ఏదైనా తీసుకురావాలి అని ఆశయంగా పెట్టుకున్నాను. ఆదిపరా శక్తి దేవి గురించి కొత్తగా తీసుకురావాలి అని చిన్నతనం నుంచి మోటోగా పెట్టుకున్నా. దాంతో పాటు మహిళా సాధికారతను, భారతీయ సంస్కృతిని, సామాజిక విలువలను నాట్యం చేస్తూ వివరించాలి అనుకున్నాను. అలా లలితా సహస్రనామం మొత్తాన్ని ఒక గంటసేపు కొరియోగ్రఫీ చేశాను. దాంతో ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు’ వచ్చింది.
కూచిపూడి నాట్యంతో వేదాలపై కొరియోగ్రఫీ చేయడం ఇదే మొదటిసారి. ఇవే కాకుండా శ్రీ సూక్తం చేయడం వల్ల ‘ఇంటర్నేషనల్ రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ ఫీస్’ అండ్ ‘కల్చరర్ బుక్ ఆఫ్ రికార్డు’ నుంచి గౌవరప్రదమైన డాక్టరేట్ ఇచ్చారు. ఇంటర్నేనల్ రోటరి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వాళు ్ల కూడా వేదాలను ఒక యూనిక్ కొరియోగ్రఫీలో తీసుకు రావడంతో ప్రత్యేకంగా సన్మానించారు.
వేదంపై నాట్యం..
సువర్చల మేడం దగ్గర కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నా. మేడం చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత సొంతంగా నాట్యంలో కొరియోగ్రఫీ చేయడం మొదలు పెట్టాను. చిన్నప్పటి నుంచి సూక్తులు వింటు పెరిగా.. సూక్తులు విన్నప్పుడు మనమెందుకు వేదంపై నాట్యం చేయకూడదు? వేదాన్ని ఎందుకు చూపించకూడదు? అని అనుకున్నాను. నిజానికి నాట్యాన్ని పంచమ వేదం అంటారు. సో పంచమవేదంలో ఈ నాలుగు వేదాలను ఎందుకు చూపించకూడదు అనే ప్రశ్నతో నా జర్నీని మొదలెట్టాను.
ఆదిపరా శక్తిని వ్యాప్తి చేయడమే లక్ష్యం
వేదాన్ని కొత్తగా, డిఫరెంట్‌గా రిప్రజెంట్ చేయాలనేదే నా ఆశయం. దసరా నవ రాత్రుల్లో నవరూప స్వరూపాలను నాట్యం రూపంలో ప్రదర్శించాను. నిజానికి ఇవన్నీ మనకు తెలిసిన విద్యలు కావు. దశమహా విద్యలు. దాంట్లో శ్రీమహాకాళి అమ్మవారి పది స్వరూపాలు ఉంటాయి. ఈ సృష్టిని అమ్మవారు ఎలా సృష్టించింది? ఎలా పాలన చేస్తున్నది? ఎలా నాశనం చేస్తున్నది? ఇవన్నీ కూడా దశమహా విద్యలో ఉంటాయి.
అష్టాదశ శక్తిపీఠాల్లో..
మనకు తెలిసిన శక్తిపీఠాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 18 ప్రధానమైనవి. మిగతా వాటిని సిద్ధపీఠాలు అంటారు. ఆ 18 శక్తి పీఠాలకు సంబంధించిన స్తోత్రాన్ని మా నాన్నతో రాయించుకుని, కర్నాటక ప్లే బ్యాక్ సింగర్ కళ్యాణ్ వసంత్‌తో పాడించుకొని దేవి నవరాత్రుల్లో 18 అమ్మవార్ల స్వరూపాలను ప్రదర్శించాను. ఒక ఆర్ట్‌ను ఇలా చేయడం ఇదే మొదటిసారి.
యూనిక్ కొరియోగ్రఫీతో..
పదేళ్ల కిందట యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మన కళ అందరికి చేరుకోవాలి అంటే సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టా గ్రామ్, యూ ట్యూబ్ సహాయపడుతున్నాయి. సోషల్ మీడియాలో నెగిటివ్‌కు సంబంధించిన వీడియోలు ఉంటాయి. కానీ నేను ఎక్కువగా పాజిటివ్‌వైపే చూస్తాను. మనం అనుకోవాలే కానీ యూట్యూబ్‌లో చాలా చూసి నేర్చుకోవచ్చు. నేను చేసేవన్నీ కూడా యూనిక్ కొరియోగ్రఫీలు. ఇప్పటి వరకు ఎవరూ చెయ్యని ప్రయోగం చేశాను. ఇట్లాంటివి చాలామందికి రీచ్ అవ్వాలని యూ ట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇదే కాకుండా ఒక ఇనిస్టిట్యూట్ కూడా ప్రారంభించాను. దాని పేరు ‘వనమాలి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’.
వేదానికి అర్థం, ముద్రలు
కూచిపూడిలో వెంపటి చిన్న సత్యంగారు ఉం టారు. వారు చేసిన కొరియోగ్రఫీని అందరు నేర్చుకొని నాట్యం చేస్తుంటారు. అలా కాకుండా సొంతం గా కొరియోగ్రఫీ చేయడం అనేది సృజనాత్మకతకు సంబంధించింది. నేను ఏదన్నా ఒక సబ్జెక్టు అనుకొని దాన్ని నేర్చుకొని కొరియోగ్రఫీ చేయడానికి ఒక నెల సమయం పడుతుంది. ప్రస్తుతం సమయం కుదరక ఇన్‌స్టిట్యూట్‌ను ఆన్‌లైన్ చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న కొరియోగ్రఫీలకు వర్క్‌షాప్స్ ఇస్తున్నాను.
ఒక చిన్న సలహా!
నాట్యం అనేది నా దృష్టిలో ఒక ప్యాషన్, ప్రొఫెషన్ మాత్రమే కాదు. నాట్యం అనేది తపస్సు లాంటింది. మనం సోడోపచార పూజలు అని అంటాం. అంటే చాలా రకాల్లో భగవంతుణ్ని ఆరాధించడం. నాట్యం కూడా అలాంటిది. నాట్యం కూడా ఒక పూజ లాంటింది. నాట్యం అనేది మనస్సు, శరీరం, ఆలోచనలు అన్నింటినీ ఏకాగ్రతగా చేసి నాట్యం చేస్తే మోక్షం కూడా లభిస్తుందని నా భావన. తమిళనాడులో భరతనాట్యానికి ఇచ్చేంత ప్రాముఖ్యత కూడా మనం ఇవ్వడం లేదు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒకరు నాట్యం, సంగీతం కానీ నేర్చుకుంటే మన కళలు పది కాలాల పాటు బతికి ఉంటాయి.
సంస్కృతిని కాపాడుకోవాలి!
ఇప్పుడు బాగా వెస్ట్రన్ కల్చర్, పబ్ కల్చర్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఫారెన్‌లో వేదం నేర్చుకునే వాళ్లు ఉన్నారు. ఇటీవల చైనాలో ఒక అమ్మాయి భారత నాట్యం నేర్చుకొని అరంగ్రేటం ఇచ్చింది. అంటే ఇతర దేశాల్లో ఉండేవాళ్లు మన కళను నేర్చుకుంటున్నప్పుడు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇంట్లో ఒక్కరైనా భారతీయ సంస్కృతిని రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఇటీవల పోలాండ్‌లో ఒక యూనివర్సిటీ లైబ్రరీ గోడలపై ఉపనిషత్ లు, గాయత్రి మంత్రాన్ని చెక్కారు. అంటే మన వేదాలు, మన ఉపనిషత్‌లు అనేవి ఎంత విలువైనవో.. అర్థం చేసుకోవాలి.
నాట్యంలో ప్యూరిటీ పోకూడదు..
నాట్యం ముద్రలు అనేవి పార్వతి దేవి, నటరాజ స్వరూపం. ఆ ముద్రలకు చాలా అర్థం ఉంటుంది. ఇన్‌స్టా గ్రామ్ రీల్స్‌లో వెస్ట్రన్ పాటలకు స్వచ్ఛమైన క్లాసికల్ ముద్రలు వేస్తున్నారు. వ్యూస్, ఫాలోవర్స్ పెరగటానికి ఇలా చేస్తున్నారు. నేను చెప్పాను కదా.. నాట్యం అనేది తపస్సు లాంటిది. త్యాగరాయ, అన్నమయ్య కీర్తనలు రాశారు. వాళ్లు ఎవరూ కూడా సభల్లోకి వెళ్లి కీర్తనలు పాడి డబ్బులు సంపాదించలేదు. ఆ పవిత్రతను కాపాడాలి. నాట్యానికి ఉన్న ప్యూరిటీ, పవిత్రత పోకుండా చూసుకోవాలి.
- రూప
ఆదిశక్తిని స్ప్రెడ్ చేస్తున్నది!
కృష్ణ సాహితీ నా బిడ్డగా పుట్టడం అదృష్టం. కృష్ణ మొదటి కొరియోగ్రఫీ ఋగ్వేదం. ఋగ్వేదంలో శ్రీ సూక్తం. అది లక్ష్మీదేవి సోత్రం. ‘వేదం మీద కొరియోగ్రఫీ అంటే చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందమ్మ’ అని చెప్పాను.. ‘ఏం కాదమ్మ నేను చేస్తాను’ అని చెప్పింది. ఆదిపరశక్తి అమ్మవారి సంకల్పంతో ముందుకు వెళ్తుంది. వాస్తవానికి మన జీవితం అనేది సమాజంలో పదిమందికి ఆదర్శంగా ఉండాలి. కృష్ణ మంచి విలువలతో కూడిన నాట్యాన్ని నేర్పిస్తుంది. కృష్ణ పర్ఫెక్టు క్లాసికల్ భంగిమలు వేస్తూ మంచి డాన్సర్‌గా నిరూపించుకుంది. సినిమా పాటలకు అందరు డ్యాన్స్ చేస్తారు. కానీ నాట్యానికి ఉన్నటువంటి పవిత్రతను ఆమె కాపాడుతున్నది. కృష్ణ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అన్నీ ఒక మెసెజ్ ఒరియంటెడ్‌గా వీడియోలే ఉంటాయి. నాక్కూడా ఇండియన్ కల్చర్‌ను ప్రమోట్ చేయడం ఇష్టం.
మాలతి లత, కృష్ణ సాహితీ తల్లి