అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం
మత్సకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఆదేశాలు
భువనేశ్వర్, అక్టోబర్ 22: దానా తుఫాన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ 120 గంటకు కిలోమీటర్ల వేగంతో నార్త్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. 24, 25 తేదీల మధ్య పూరీ, సాగర్ ద్వీపాల నడుమ ఈ తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ కారణంగా ఈ నెల 23 వరకు విపరీతమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో ఒడిశా ప్రభుత్వం తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిం దిగా అధికారులను ఆదేశించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనున్న తుఫానుకు ‘దన’ అనే పేరును ఖతర్ సూచించింది. అరభిక్ భాషలో ‘దన’కు దాతృత్వం అనే అర్థం వస్తుంది.