calender_icon.png 28 September, 2024 | 9:04 PM

మూసీ ప్రాంతం.. మురికికూపంలా మారింది: దాన కిషోర్

28-09-2024 05:37:20 PM

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో హైడ్రా అధికారులు మూసీ రివర్ డెవలప్‌మెంట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చేవి.. 1927లో వరదల వల్ల భారీ నష్టం జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఇటీవల దాదాపు 9 సెంమీటర్ల పైగా వర్షాలు వచ్చాయని తెలిపారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతోందన్నారు. మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారింది.. దానిని మార్చాలని దాన కిషోర్ పేర్కొన్నారు. మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలేనన్నారు. 2030 కల్లా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుతోందని ఆయన వెల్లడించారు. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3,800 కోట్ల వ్యయం చేస్తున్నామని లెక్క చెప్పారు.

2026లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన మూసీని విస్తరించాలన్న దాన కిషోర్ మూసీ నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ నిర్వాసితులకు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నామని తెలిపారు. చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పనిచేస్తున్నారని దాన కిషోర్ వ్యాఖ్యానించారు. మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించలేదన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే 55 కి.మీ పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని దాన కిషోర్ తెలిపారు. ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణంలో ట్రాఫిక్ తగ్గుతోందన్నారు. మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామని పేర్కొన్నారు. మూసీ ఆధునీకరణ వల్ల వ్యాపారాలు పెరుగుతాయని చెప్పారు. మూసీ ఆధునీకరణకు ప్రజలందరూ సహకరించాలని దాన కిషోర్ కోరారు.