- బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ పీసీసీ సోషల్ మీడియా పోస్ట్
- బెడిసికొట్టడంతో కంగుతున్న కాంగ్రెస్ పెద్దలు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ‘అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట’ అన్నట్లు పీసీసీ సోషల్ మీడియా విభాగం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బూమరాంగ్ అయింది. చివరకు పార్టీ అధిష్ఠానం స్పందించి ఆ విభాగానికి మొట్టికాయలు వేసే పరిస్థితి ఏర్పడింది.
‘ఫాంహౌస్ పాలన కావాలా..? ప్రజాపాలన కావాలా..? ’ అంటూ పీసీసీ సోషల్ మీడియా విభాగం గత నెల 29న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఫాం హౌస్ పాలనకు ‘ఏ’ అని, ప్రజాపాలనకు ‘బీ’ అని ఆప్షన్లు ఇచ్చింది. ఈ సర్వేలో ఎక్కువ మంది నెటిజన్లు ‘ఏ’ ఆప్షన్ ఇచ్చి ఫాంహౌస్ పాలనను ఎంచుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు కంగుతున్నారు.
ఈ మేరకు వారు పీసీసీ సోషల్ మీడియా చైర్మన్, టీఎస్టీఎస్ చైర్మన్ సతీశ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఆ రెండు పదవుల నుంచి ఆయన్ను తొలగించాలనే డిమాండ్ కొందరు చేసినట్లు తెలిసింది. సంబంధం లేని పోస్ట్ పెట్టి అనవసరమైన వివాదంలో చిక్కుకున్నామని సోషల్ మీడియా విభాగ సభ్యులు భావిస్తున్నారని, ఎవరిపై ఎలాంటి చర్యలుంటాయోనని ఆందోళన చెందుతున్నారని తెలిసింది.