‘శ్రీ దాశరథి’-
దారుణం:
కొరడాలతో కొట్టించడమా?
మహాకవికి మహాగండమా?
‘జనధర్మ’ వారపత్రికలో
16 మే 1968న ఆచార్య కోవెల
సంపత్కుమారాచార్యులు ప్రచురించిన వ్యాసం (శ్రీ దాశరథి దారుణం:
కొరడాలతో కొట్టించడమా? మహాకవికి
మహాగండమా?) ఆధారంగా..
‘జనధర్మ’ పత్రికలో ప్రతివారం ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు ‘మన కవులు రచయితలు పండితులు’ అనే శీర్షికతో వ్యాసాలు రాసేవారు. అందులో 25 ఎంపిక చేసుకుని పుస్తకంగా ప్రచురించారు. వాటి లో మాడభూషి శ్రీరంగాచార్యుల సాహితీ వైభవాన్ని వివరించారు. (మా ముత్తాత అంటే ఎంఎస్ ఆచార్య, వారి తండ్రి ప్రసన్న రాఘవాచార్యులు, వారి తాత శ్రీరంగాచార్యులు) అందు లో సంపత్కుమార వ్యాసం ప్రచురించారు. ఆ తరువాత దాశరథి పేరుతో వివర మైన వ్యాసాన్ని సంపత్కుమార రచించారు. అది 25 వ్యాసాల తరువాత ‘మన కవులు రచయితలు పండితులు’ పుస్తకంగా ప్రచురణ అయింది. తరువాత రెండో పుస్తకం వేయాలనుకున్నారు కాని, వేయలేదు. కానీ, ‘జనధర్మ’ వారపత్రికలో 16.5.1968 నాడు 3వ, 6వ పేజీల్లో పై వ్యాసాలు ప్రచురించేవారు.
ఆ కాలంలో నేను 12 సంవత్సరాల పిల్లవాడిని. వరంగల్లులో ఇంటికి వచ్చే పత్రికలు చూసేవాడిని. చదవి అర్థం చేసుకోవడం కష్టం. 1972 నుంచి నేను ‘జనధర్మ’ ప్రెస్‌లో నేర్చుకునే వాణ్ని. తండ్రి దాశరథి వేంకటాచార్యుల వారిద్వారా కృష్ణమాచార్యులు (దాశరథి) ‘కాదంబరి’ వంటి కఠినమైన గద్యాన్ని చాలా భాగాలను కంఠస్థం చేశారు. దాశరథి ఉర్దూ ఫాలసీ పాఠ్యభాగాల్లో చదువుకున్నారు. మీర్జా గాలిబ్ కవితా మాధుర్యాన్ని అర్థం చేసుకుని, ముగ్ధుడైన సాహి తీమూర్తిగా ఎదిగారు. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే దాశరథి గాలిబ్ కవి త్వాన్ని అనువదించడం ఆశ్చర్యం. అప్పుడే గార్ల జాగీరులో రైతు ఉద్యమంలోకి ప్రవేశించారు దాశరథి.
‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అని, ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ నినాదాల మాటలు తూటాలై, మం త్రాలై, దుర్మార్గుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఆ ఉద్యమ కవిత్వాలను ఇప్పటికీ నా జీవితానికి స్ఫూర్తిదాయకంగా వెలుగుతూ ఉన్నాయి. సంపత్కుమార వ్యాసంలో అనేక విశేషాలు ఇచ్చారు.
‘గూడూరు’ అనే పేరుతో చాలా ఊళ్లున్నాయి. వాటిలో ఒకటి మానుకోట (మహబూబాబాద్) తాలూకాలో ఉన్నది. ఈ తాలూకా వరంగల్లు జిల్లాకు చెం దింది. తెలంగాణలో పేరు ప్రతిష్ఠలుగల పండితులు దాశరథి వెంకటాచార్యులు వారిది ఈ గూడూరు. సంస్కృత, ద్రావిడ భాషలలో మంచి ప్రావీణ్యం ఆచార్యుల వారిది. ఉభయ వేదాంతా నిష్కృష్టంగా పాండిత్యం గలవారు, ఉత్తమ సాహిత్యకులు. 1925లో వారికి ప్రథమ సంతానం కలిగింది. ఆ సంతానం పేరు కృష్ణమాచార్యులు.
కృష్ణమాచార్యుల బాల్యం ఇంటివద్దే గడిచింది. విద్యాభ్యాసం తండ్రివద్దే జరిగింది. తండ్రి కుమారునికి ప్రధానంగా సంస్కృతం నేర్పినారు. నేర్పడమంటే చెప్పిందంతా కంఠపాఠం చేయడమే. ఆనాడు నేర్చిన కావ్యా లలోని శ్లోకాలూ, ‘కాదంబరి’ వంటి జటిల గద్య గ్రంథంలోని అనేక భాగాలూ కృష్ణమాచార్యులకు కంఠస్థమే. సంసృతంతోపాటు తెలుగూ సాగింది. ఇంటి విద్యను సాంప్రదాయిక రీతిలో చదివే సమయంలోనే ‘బడి చదువు’ కూడా సాగింది. ఆ రోజుల్లో, ఆ రోజుల్లోనే ఏమిటి, ఈ రోజుల్లో గూడా ఆ ప్రాంతం వాళ్లకు వరంగల్లులోకన్నా ఖమ్మంతో ఎక్కువ సంబంధం, అది దగ్గర కూడా.
అందుకని కృష్ణమాచార్యుల ఉన్నత పాఠశాల విద్య ఖమ్మంలో సాగింది. ఖమ్మంలో ఉన్న ఆ ఉన్నత పాఠశాలను ఆ రోజుల్లో ‘ఉస్మానియా హైస్కూల్’ అనేవారు. అక్కడ కృష్ణమాచార్యులకు డి.రామలింగం, హీరాలాల్ మోరియా, ఎం.ఎల్. నరసింహారావు ప్రభృతులు సహపాఠులూ, స్నేహితులు. కృష్ణమాచార్యులకు ఇంటి పేరే అసలు పేరుగా మారి, ‘దాశరథి’ అయింది.
నిర్బంధంగా ఉర్దూ, ఫారసీ
‘ఆ రోజులలో పాఠశాల విద్యార్థులకు నిర్బంధంగా ఉర్దూ ఫారసీ పాఠ్యభాగంగా ఉండేవని’ సంపత్కుమార చెప్పారు. అది ఆయనకే మేలు అయింది. నిజాం నిరంకుశ ప్రభువులకు ఉర్దూలో ఫారసీలో విమర్శించే అవకాశం వచ్చింది. మరోవైపు తెలుగు, సంస్కృతంలో కూడా సహజంగానే వైష్ణవ కుటుంబం కనుక సాహితీ పునాదులు పడినాయి. దాశరథి తరగతికి ‘జిక్కీ సాహెబ్’ ఆ భాషలు బోధిస్తూ ఉండేవారు. అయితే, ఆ సాహెబ్ ఏదో భాష చెప్పి పంపివేయడం కాకుండా విద్యార్థులకు ఆ భాషా సాహిత్యంతో చక్కని పరిచయం కలిగించేందుకు ప్రయత్నించేవారు.
ఈ ఫలితంగానే దాశరథికి ఉర్దూలో గాఢత్వం కలుగడమేకాక సాహిత్యంతోనూ గట్టి పరిచయం ఏర్పడింది. అంతే కాదు, ఆ భాషలో మీర్జా గాలిబ్ కవితా మాధుర్యం ఆయనను ముగ్ధుణ్ణి చేసింది. ఆనాటి అనుభూతిని గురించి చెబుతూ, ‘సాహితీ వాసనా విలసితమయిన మనస్సులతో ఏదో ఊహ ఊహించుకుంటూ, క్లాసురూమ్‌లో అసలు పాఠాలవైపు పోలేక పోయే వాళ్ళం!’ అని రాశారు. ఆనాడు అంతగా గాఢముద్ర పడడం వల్లనే ‘గాలీబ్ గీతాలు’ తెలుగు లోకి దాశరథి అనువదించారు. ‘అయితే, ఇదంతా ఆయనకు దాదాపు పదిహేను, పద్దెనమిది ఏండ్ల ప్రాయంలోనే జరిగింది’ అని దాశరథి గురించి సంపత్కుమార చెప్పారు.
రజాకార్లు, రాజకీయాలు
ఖమ్మం నాటికీ నేటికీ కూడా తెలంగాణలో రాజకీయ చైతన్యం అధికంగా కలవాటిలో ఒకటి. అయితే, ఆనాటి పరిస్థితులూ, నిజాం పాలనా, రజాకార్ల ఆగడాలు ఇవన్నీ యువకుల్ని రాజకీయాలలోకి లాగాయి. దాశరథి, ఆయన మిత్రులూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ రాజకీయ ప్రవేశోద్రేకం హఠాత్తుగా దాశరథికి కలుగలేదు. చిన్నప్పటి నుంచీ అనేక సంఘటనలు ఆయనలో కదులుతూ, బాధ పెడుతూనే ఉన్నాయి. అవన్నీ ఆయనకు రాజు లూ రాచరికాలూ అంటే గిట్టకుండా చేశాయి. నైజాం నవాబు పదవీభ్రష్ఠుడై పోవాలని, తెలంగాణం స్వతంత్రం కావాలనేవి ఆయన కన్న కలలు. ‘రైతులూ, కూలీలూ, వాళ్ళు పడే బాధలూ చూస్తున్నకొద్దీ ఏదో చేయాలి. ఆశయసిద్ధి కోసం ఏదో పాటు పడాలి’ అనిపిస్తూ ఉండేది.
‘అసలు నిజాం రాష్ట్రమే వెనుకబడ్డ ప్రాంతం. మళ్లీ జాగీర్లు, బ్రిటి ష్ ఇండియా, సంస్థానాలు, వాటిలో మళ్ళీ చిన్నచిన్న సంస్థానాలైన జాగీర్లు. అలాంటి జాగీ ర్లలో ‘గార్ల’ ఒక టి. అక్కడి రైల్వేమార్గంలో మా నుకోటకూ డో ర్నకల్ జంక్షన్‌కూ మధ్య ఇది ఉంటుంది. జాగీరు కాని ప్రాంతాన్ని ‘ఖాల్సా’ అంటారు. జాగీర్లకంటే ఖాల్సాగా ఉం డడమే గుడ్డిలో మెల్లలా మెరుగు. జాగీర్లలో ‘జులుం’ అధికంగా ఉండేది. దాశరథి చిన్నప్ప టి నుండీ ఈ జులుం చూస్తూ ఉన్నవాడు. రైతుల కష్టాలు ఆయనలో క్షోభను కలిగించాయి.
అప్పుడే గార్ల జాగీరులో ‘రైతు ఉద్యమం’ ప్రారంభమైంది. అం దులో దాశరథి ప్రవేశించారు. జాగీర్దారుకూ ప్రభుత్వ దమననీతికి విరుద్ధంగా పోరాటం సాగించారు. ఆ రోజుల్లోనే- ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’, ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అనే పద్య పాదాలు దాశరథి హృదయాన్ని చీల్చుకొని వచ్చి ప్రజలను ఉత్తేజ పరిచాయి.
వేధించిన, వేటాడిన వైనం
నిజానికి రాజకీయాల్లో ప్రవేశించి దాశరథికన్నా తీవ్రంగా పోరాడిన వాళ్లూ, కష్టాలు పడ్డవాళ్లూ ఉన్నారు. కానీ, ప్రభుత్వానికి దాశరథితో వచ్చిన చిక్కు ఆయన వాక్కు. పద్యాల్లో, పాటల్లో అగ్ని కురిపించేవారు. కురిపిస్తున్నానని తెలిసి మరీ కురిపించేవారు. అప్పటి దాశరథి ‘అంతర్నాదం’ ఇలా ఉండేది.
‘నాగీతావళి ఎంతదాః సుప్రయా
ణంబౌనో, అందాక ఈ
భూగోళమ్మున చిచ్చుపెట్టెదను. ని
ప్పుల్వోసి హేమంత భామా గాంధర్వ
వివాహమాడిదను..’
‘వీణియ తీగెపై పదును
పెట్టిన నా కరవాల ధానితో
గానము నాలపింతు, కవి
కంఠము నుత్తరణంబొనర్చి స్వ
రానికు భూమినుండి రస
గంగలు చిమ్మెద. పీడిత ప్రజా
వాణికి ‘మైకీ’ అమర్చి అభ
వాదులకున్ వినిపింపజేసెదన్.’
అందుకే, అనటమే కాకుం డా, ఆ పనే చేసారు. కాబట్టే, పోలీసు బలగం ఆయనను వెంటాడింది. ఆయనను బంధించి, జైల్లో పెట్టి, నోరు నొక్కుదామని ప్రయత్నించింది. ‘స్వాతంత్య్రం కోరే వ్యక్తి బంధంలోకి పోవడానికి ఎలా ఒప్పుకుంటాడు? అందకుండా పోతున్నాడు. ఎంత అందకుండా పోతుంటే అంత విప్లవకారి అయిపోయి పోలీసుల్ని ఆయాస పెట్టిన వాడయినాడు.
1946 డిసెంబరు 18. మానుకోట తాలూకాలో సమావేశాలు చేస్తూ విప్లవ విస్ఫులిం గాలు చిమ్ముతూ ఒక ఊళ్లో సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు దాశరథి. వాక్కులో ఆవేశం నిప్పులు కురిపిస్తున్నది. చివర మాటగా
‘ప్రాణములొడ్డి ఘోర గహ
నాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ సృజించి ఎము
కల్ నుసిచేసి పొలాలు దున్ని భో
షాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే తెలం
గాణము రైతుదే, ముసలి
నక్కకు రాచరికంబు దక్కునే’
అని ఉద్ఘోషించారు. హఠాత్తుగా పోలీసు బలగం వచ్చి పడింది. వాళ్ళకు పై పద్యం గుండెల్లో పోటుగాదా మరి. దాశరథిని ప్రజల జయధ్వానాల మధ్య ‘అరెస్టు’ చేశారు. అక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న నెల్లికుదురుకు నడిపించి తీసుకు వెళ్ళి ఠానాలో బంధించారు. కాని, ఆయన అక్కడా ఆగలేదు. పోలీసుల్ని ఏమార్చి తప్పించుకు పోయాడు. కాని, ఈ విషయం ఎంతోసేపు దాగలేదు. గుఱ్ఱాలెక్కిన నలభైమంది ‘సైనికులు’ ఆయనను వెంటాడారు. అయినా, దొరుకలేదు. మారు వేషా లతో, మారుదారులలో, మారు రూపాలతో తిరుగుతూ తన పని తాను చేస్తూనే ఉన్నారని సంపత్కుమార ‘జనధర్మ’లో వివరించారు.
ఆ రోజుల్లో ఆయనకు ‘ఆంధ్ర మహాసభ’తో సంబంధం ఉండేది. ‘స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహోద్యమం ప్రారంభించింది. భారత స్వాతంత్య్రం మిగిలిన దేశానికి అంతకూ వచ్చింది కాని, ఈ (నిజాం) రాష్ట్రానికి రాలేదు. దాశరథి గుండె మండి పోయింది. ఇంకా, ఈ నవాబు రాచగద్దెను పట్టుకొని వ్రేళ్ళాడడమేమిటి?
కొరడాలతో కొట్టించడమా?
మహాకవికి మహాగండమా?
ముక్త కంఠంతో ఇలా అంటూ సత్యాగ్రహానికి తలపడితే పోలీసువారు ఊరుకుంటారా? గార్లలో దొరికారు పోలీసులకు దాశరథి. పట్టుకొని ఠానాలో పెట్టి కొరడాలతో కొట్టారు. అయినా, ఉద్య మాన్ని గురించి దాశరథి నోట ఏ ఆచూకీ తెలుసుకోలేక పోయారు. జాగ్రత్తగా, భద్రంగా వరంగల్లుకు పంపించారు. పదహారు నెలల శిక్ష పడింది. ఇది 1947. సెప్టెంబరులో వరంగల్లు జైలులో కొన్ని రోజులు వుంచినా కూడా, ఆ ప్రాంతం పరిచితం కాబట్టి, పారిపోతాడేమోనని మరికొందరు ఖైదీలతో నిజామాబాదు జైలుకు పంపారు.
ఆ జైలులోని ఒక సంఘటనే ఈ వ్యాసానికి ప్రారంభమయింది. జైళ్లలోనూ రాజకీయ ఖైదీలు ఉండి సుఖాన్నేమీ అనుభవించలేదు. నిజామాబాదు జైల్లో ఉన్నప్పుడు రజాకార్ల ముఠా రాచరికపు అండదండలతో జైల్లోకి వచ్చి మధ్యాహ్న ఆహారం తీసుకుంటున్నారు. అప్పుడే వారి దృష్టి రాజకీయ ఖైదీలమీద పడింది. ఇష్టం వచ్చినట్లు జైలు అధికారులు చూస్తుండగానే వారిని కొట్టారు.
1948 జనవరి 11. ఆ రోజు దాశరథికి మృత్యుప్రాయం. బాగా దెబ్బలు తగిలాయి. ఒకటి, రెండు ఎముకలూ విరిగాయి. పడిపోయాడు. అందరూ బతకడనే అనుకున్నారు. కాని, ఎలాగో ఆ మృత్యురాత్రి గడిచింది. తెల్లవారి కళ్ళు విప్పినప్పుడుగాని తోటి ‘సత్యాగ్రహ సైనికుల’కు మనసు కుదుటబడలేదు. జైలుద్వారా ఏదో వైద్యం జరిగింది. కాని, ఫలితం కనబడలేదు. స్వస్థత రాలేదు. ఆ తరువాత హైదరాబాదు (చంచల్‌గూడా) జైలుకు మార్చా రు. అక్కడ చాలా రోజులు మంచం మీదే గడిచింది. ఏదో ఒక మాదిరి స్వస్థత కలిగింది.
తెలంగాణకు ‘ఎన్నాళ్ళకు తెల్లవారె’
‘పోలీస్ ఆక్షన్’ జరిగింది. రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించింది. రాజకీయ ఖైదీలకు ముక్తి కలిగింది. 1948 సెప్టెంబరు 18న సహచరులతోపాటు దాశరథి జైలునుండి బయటకు వచ్చాడు. స్వతంత్ర రాష్ట్రాన్ని కళ్ళారా చూశాడు. ఎగిరి గంతువేశాడు.
‘ఎన్నాళ్ళకు తెల్లవారె
ఎన్నాళ్ళకు కన్ను దూరె
తెలుగు వెలుగు వెలుగు తెలుగు
తెలుగు తెలుగు తెలుగు తెలుగు’
ఎంత ఆనందం! కాదా మరి! కన్న కలలు ఫలించాయి. అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? తెలుగుదేశంలో ‘సమఃసాహిత్యం’ అనడానికి వీలైన కవిత సృష్టింపబడిందంటే ప్రధానంగా అది దాశరథి కవితతోనే అని చెప్పవచ్చు. ఉద్బోధ కవిత చాలా వచ్చింది. కాని, దాశరధి కవితలో కేవలం ఉద్బోధ మాత్రమే కాదు. ‘యుద్ధ ప్రకటన’ ఉంది. చూడండి.
‘తెలంగాణమ్మున గడ్డి పోచయును, సం
ధించెన్ కృపాణమ్ము, రా
జలలాముండను వాని పీచమడపన్
సాగించె యుద్ధమ్ము. భీ
తలపోయెన్ జగమెల్ల ఏమియగునో
తెల్యంగ రాకన్. దిశాం
చలముల్ శక్ర ధనుః
పరంపరలతో సయ్యాటలాడిన్ దివిన్.’
(వీర తెలంగాణము)
రాచరికపు రీతిని విమర్శిస్తూ, ఆ నాటి ‘రాజకీయ’ వ్యవహారాలలోని మోసాన్నీ, కుళ్లునూ ప్రజలకు తెలియజేస్తూ కాళోజీ ప్రభృతులు జనాన్ని చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. కాని, దాశరథి అంతటితో ఆగలేదు, ప్రజలను రెచ్చగొట్టారు. ఇదే విషయం -
‘పాటలు పాడితిన్ తెలుగు
బాబులు నిద్దుర మేలుకోగ, పో
రాటము సేయగా. కరుకు
రాచరికమ్మును గూలద్రోయగా
కోటిగళాల నొక్కకడ
కూర్చితి, విప్లవ శంఖ మూదితిన్
నాటికి నేటికిన్ తెలుగు
నాటికి వెచ్చదనిమ్ములూదితిన్’
అని ‘రుద్రవీణ’ సంపుటిని తన కోటి రత్నాల వీణ తెలంగాణకు అంకితం చేస్తూ చెప్పారు దాశరథి. అందుకే, దాశరథి కవిత ‘అగ్ని కవిత’ అయింది. ఆయన రచనల పాయ అగ్నిధార అయింది, ఆయన గీతావళి ప్రయా ణం చేసినంత వరకూ. ఆ అగ్నిధార విరియనే విరిసింది. కడకు రాచరికం మండిపోయి తీవ్రమైన స్వాతంత్య్రం ఆ మంటల్లోంచి ఆవిర్భవిం చింది. పోరాటం విజయవంతమైంది. ‘స మ ర సాహితి’ సఫలమయింది.నిజానికి 1948తోటే రాజకీయాలు వదులుకొన్న దాశరథిని 1956లో రాజకీయాలు వదులుకున్నాయి.
‘జనధర్మ’ వారపత్రికలో 16 మే 1968న ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు ప్రచురించిన వ్యాసం (దారుణం:
కొరడాలతో కొట్టించడమా?
మహాకవికి మహాగండమా?) ఆధారంగా..
----- మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, కేంద్ర సమాచార పూర్వ కమిషనర్