calender_icon.png 23 October, 2024 | 2:54 PM

దామగుండం మరో రామగుండం కావొద్దు

23-09-2024 12:00:00 AM

నేవీ రాడార్‌ను అడ్డుకుందాం 

సేవ్ దామగుండం ధర్నాలో పర్యావరణవేత్తల పిలుపు

ముషీరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌కు ఆక్సిజన్ సిలిండర్ వంటి వికారాబాద్ లోని దామగుండం అడవి మరో రామగుండం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేశారు. దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం 12 లక్షల చెట్లను నరకడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, రాడార్ కేంద్రాన్ని ప్రజలకు ఇబ్బంది కలగని మరోచోటికి తరలించాలని డిమాండ్ చేశారు.

నేవీ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో ‘సేవ్ దామగుండం జేఏసీ, తులసీచందు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు దామగుండంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ పూజారి సత్యానంద స్వామి, పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో పాటు అనేక ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణవేత్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సత్యానంద స్వామి మాట్లాడుతూ.. 2,713 ఎకరాల దేవాలయ భూముల్ని ఫోర్జరీ చేసి అటవీశాఖకు అప్పగించారని ఆరోపించారు. నేవీ రాడార్ కేంద్రంతో పాటు యాంటినీ పార్కు, స్కూళ్లు, టౌన్‌షిప్స్ కట్టడం వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, ఏళ్ల చరిత్ర కలిగిన రామలింగేశ్వర స్వామి ఆలయం కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని, అభివృద్దిని బ్యాలెన్స్ చేయకపోతే వయనాడ్, ఉత్తరాఖండ్ వంటి ప్రకృతి విలయాలు చూడాల్సి వస్తుందన్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పర్యావరణ నష్టం రిపోర్ట్‌ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మూసీ నది పుట్టిన దామగుండం అడవుల్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కార్.. మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామనడం హాస్యాస్పదమని విమర్శించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ఆనంద్, దామగుండం మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, దామగుండం జేఏసీ కన్వీనర్ గీత, తులసీచందు పాల్గొన్నారు.